బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేందుకు తెరపైకి డిస్కంలు

ఒక్కో యూనిట్‌ను రూ.3.90లకే కొనేందుకు ఛత్తీస్‌ ఘడ్ ప్రభుత్వంతో గత తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోగా.. చివరకు కరెంటు సరఫరా అయ్యే సమయానికి అది రూ.5.64 గా మారిందని డిస్కంలు తెలిపినట్టు సమాచారం.

Advertisement
Update:2024-06-18 07:48 IST

తెలంగాణలో కరెంటు కొనుగోళ్ల వివాదం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టాక ఇది పూర్తి స్థాయిలో రాజకీయ రచ్చగా మారింది. కమిషన్ విచారణకు హాజరయ్యేది లేదని, కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ కేసీఆర్ రాసిన లేఖ మరింత మంట రాజేసింది. ఈ లేఖపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఈ క్రమంలో తాజాగా డిస్కంలను తెరపైకి తెచ్చారు. గత ఒప్పందాల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని డిస్కంలు కమిషన్ కు చెప్పినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ మరింత జోరుగా దాడి మొదలు పెట్టింది.

ఛత్తీస్‌ ఘడ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడీషియల్‌ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపినట్టు సమాచారం. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే కరెంటు లభిస్తుండగా, ఎక్కువ రేటు చెల్లించి ఛత్తీస్‌ ఘడ్ నుంచి కొనుగోలు చేశారని, అందుకే నష్టం వాటిల్లిందని అంటున్నారు. ఒక్కో యూనిట్‌ను రూ.3.90లకే కొనేందుకు ఛత్తీస్‌ ఘడ్ ప్రభుత్వంతో గత తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోగా.. చివరకు కరెంటు సరఫరా అయ్యే సమయానికి అది రూ.5.64 గా మారిందని అందువల్ల రూ.3,110 కోట్ల అదనపు భారం పడిందని డిస్కంలు తెలిపినట్టు సమాచారం.

చత్తీస్ ఘడ్ తో వివాదం..

2017 చివర్లో ఛత్తీస్‌ ఘడ్ నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా ప్రారంభమైంది. పీపీఏలో పేర్కొన్న వెయ్యి మెగావాట్ల సరఫరా పూర్తిగా జరగలేదు. బకాయిల చెల్లింపుల వివాదం మొదలు కావడంతో 2022 ఏప్రిల్‌ నుంచి సరఫరా ఆగిపోయింది. 2017 నుంచి 2022 మధ్యకాలంలో కూడా పూర్తిస్థాయిలో కరెంటు సరఫరా కాకపోవడంతో బహిరంగ మార్కెట్ లో కరెంటు కొనాల్సి వచ్చిందని దానికోసం రూ.2,083 కోట్లు ఖర్చయిందని తెలంగాణ డిస్కంలు తెలిపాయి. మొత్తంగా అదనపు భారం రూ.3,110 కోట్లు అయినట్టు డిస్కంలు కమిషన్ కి వెల్లడించాయని అంటున్నారు. తెలంగాణ డిస్కంలనుంచి బకాయిలను ఇప్పించాలని చత్తీస్ ఘడ్ విద్యుత్ సంస్థలు ‘విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’లో పిటిషన్‌ కూడా వేశాయి. దీనిపై విచారణ జరుగుతోంది. ఈలోగా తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఈ వివాదం అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధానికి దారితీసింది. 

Tags:    
Advertisement

Similar News