హీరో ఎన్టీఆర్ తో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ భేటీ.. ఎందుకంటే..?

సుమారు రూ.4కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని రెడీ చేసి ఆవిష్కరణ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్, జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు.

Advertisement
Update:2023-05-02 17:04 IST

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సినీ హీరో ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆయనను ఆహ్వానించారు. ఈనెల 28న ఖమ్మంలోని లకారం చెరువు ట్యాంక్ బండ్ మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ ప్రతిమను రూపొందించారు. 45 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం చూడముచ్చటగా తయారవుతోంది. తాత విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మనవడిని ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రి పువ్వాడ అజయ్.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శతజయంతి రోజునే ఈనెల 28న ఖమ్మం లోని లకారం చెరువులో విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇప్పటికే లకారం చెరువు పర్యాటక ప్రదేశంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ చెరువుకి ఎన్టీఆర్ విగ్రహం అదనపు ఆకర్షణ కాబోతోంది. ఖమ్మంలోని ఎన్టీఆర్ అభిమానులు విగ్రహ ఆవిష్కరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగురాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్‌ అభిమానులు, అభిమాన సంఘాల నాయకులు ఈ విగ్రహావిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకకు జూనియర్‌ ఎన్టీఆర్‌ తోపాటు సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరవుతారు.

4 కోట్ల రూపాయల వ్యయం..

ఖమ్మంకు చెందిన ఎన్టీఆర్‌ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌ సభ్యులతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, తానా సభ్యులు, ఎనఆర్‌ఐలు ఈ విగ్రహ ఏర్పాటుకు నిధులు సమకూర్చారు. సుమారు రూ.4కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని రెడీ చేసి ఆవిష్కరణ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్, జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు.

Tags:    
Advertisement

Similar News