దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ.. ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు నిర్వాకంతో దేశం వెనక్కు వెళ్తోందని, అదే సమయంలో కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోందని వివరించారు సీఎం కేసీఆర్.

Advertisement
Update:2023-04-12 20:42 IST

తొమ్మిదేళ్ల కిందట తెలంగాణ అంటే వెనుక‌బ‌డిన ప్రాంతం అనేవారని, కానీ ఇప్పుడు అభివృద్ధిలో మ‌న ద‌రిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదని అన్నారు సీఎం కేసీఆర్. త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ నెంబ‌ర్-1 గా నిలిచిందని చెప్పారు. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్ర‌గామిగా తెలంగాణ ఉందని వివరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

మైనార్టీలకోసం 12వేల కోట్లు..

ఉమ్మ‌డి రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి ప‌దేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఖ‌ర్చు కేవ‌లం రూ. 1200 కోట్లు మాత్ర‌మేనని చెప్పారు సీఎం కేసీఆర్. కానీ తెలంగాణ ప్ర‌భుత్వంలో మైనార్టీల కోసం గ‌త తొమ్మిదేళ్లలో రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టామని వివరించారు. తెలంగాణ అభివృద్ధి చెందుతున్నంత‌గా మిగ‌తా రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని అన్నారు. తాగు, సాగు నీరు, క‌రెంట్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకున్నామని చెప్పారు.

తెలంగాణ ముందుకు, దేశం వెనక్కు..

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు నిర్వాకంతో దేశం వెనక్కు వెళ్తోందని, అదే సమయంలో కేంద్రం సహకరించకున్నా తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోందని వివరించారు సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలులోకి రావాలన్నారు. బీఆర్ఎస్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కి ఘన స్వాగతం లభిస్తోందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ లాగా అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమన్నారు. ఈ దేశం మ‌నంద‌రిది.. చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు దేశం కోసం పోరాడాలి అని పిలుపునిచ్చారు. ఆవేశంతో కాదు.. ఆలోచ‌న‌తో ఈ దేశాన్ని కాపాడుకుందామన్నారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా చివ‌ర‌కు న్యాయ‌మే గెలుస్తుందని, గంగాజ‌మునా తెహ‌జీబ్ సంస్కృతి విశిష్ట‌మైంది అని కేసీఆర్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News