కేసీఆర్‌పై కోపాన్ని మెదక్‌ ప్రజలపై చూపొద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి మెదక్‌ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Advertisement
Update:2024-12-25 17:16 IST

కేసీఆర్‌ పై కోపాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం మెదక్‌ జిల్లా ప్రజలపై చూపించొద్దని ఎమ్మెల్సీ కవిత కోరారు. బుధవారం క్రిస్మస్‌ సందర్భంగా మెదక్‌ చర్చిలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, శశిధర్‌ రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడె రాజీవ్‌ సాగర్‌తో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మెదక్‌ లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పరమత సహనానిరి మెదక్‌ నిదర్శనమని అన్నారు. కేసీఆర్‌ ఈ జిల్లాను ఎంతో అభివృద్ధి చేశారని, గోదావరి జలాలతో సింగూరును నింపారని తెలిపారు. మెదక్‌ జిల్లాకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ఈ ప్రభుత్వం నిలిపి వేయడం దారుణమన్నారు. వెంటనే ఆ పనులు కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్మస్‌ గిఫ్ట్‌, రంజాన్‌ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీని నిలిపి వేశారన్నారు. పింఛన్ల పెంపుకోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎదురు చూస్తారని.. రూ.2,500 ఎప్పుడు ఇస్తారా అని ఆడబిడ్డలు వేచి చూస్తున్నారని తెలిపారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు స్కూటీలు అందజేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. మహిళలను రేవంత్‌ రెడ్డి నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు.


 



కేసీఆర్‌ కిట్‌ పంపిణీని నిలిపి వేయడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో నేరాలు 40 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుబంధు సాయాన్ని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రైతుభరోసా పేరుతో అర్హులను తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు. పీఎం కిసాన్‌ నిబంధనలు అమలు చేస్తే 30 శాతం మంది రైతులకు కూడా రైతు భరోసా రాదన్నారు. ధాన్యానికి బోనస్‌ ఇస్తామని చెప్పి కేవలం సన్నవడ్లకే ఇస్తుందని, మొక్కజొన్న, కంది, సోయాబీన్, పత్తి లాంటి పంటలను మద్ధతు ధర పెంచుతామన్న హామీ ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీలను ఎప్పుడు తెరిపిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందనని డిమాండ్‌ చేశారు. క్రైస్తవులకు, కేసీఆర్‌ కు పేగు బంధం ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి చర్చిలోనూ ప్రార్థనలు చేశారని గుర్తు చేశారు. మెదక్‌ చర్చి తెలంగాణాకు తలమానికమని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News