కేసీఆర్ రిట్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. కమిషన్ ఏర్పాటుని పరోక్షంగా సమర్థిస్తూ తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. కమిషన్ ను రద్దుచేయడం కుదరదని స్పష్టం చేసింది.

Advertisement
Update:2024-07-01 11:45 IST

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ ని రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు కీలక వాదనలు జరిగాయి. విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ ఏర్పాటైందని కేసీఆర్‌ తరపు న్యాయవాది ఆదిత్య సోందీ కోర్టుకి తెలిపారు. అయితే పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారుల్ని సైతం కమిషన్ విచారించిందని.. దీన్ని కొనసాగిస్తేనే అసలు విషయాలు బయటపడతాయని ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు, కేసీఆర్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.

కమిషన్ కి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి, విచారణ సందర్భంగా కేసీఆర్ కి నోటీసులివ్వడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉద్దేశపూర్వకంగానే కమిషన్ తనకు నోటీసులిచ్చిందని, గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే కాంగ్రెస్ ఈ కమిషన్ ని ఏర్పాటు చేసిందని కేసీఆర్ ఆక్షేపించారు. విచారణ కమిషన్ నుంచి తప్పుకోవాలంటూ ఆయన నేరుగా జస్టిస్ నరసింహారెడ్డికి ఓ లేఖ రాశారు. అనంతరం అసలు కమిషన్ ఏర్పాటు సరికాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. కమిషన్ ఏర్పాటుని పరోక్షంగా సమర్థిస్తూ తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. కమిషన్ ను రద్దుచేయడం కుదరదని స్పష్టం చేసింది.

చత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో అవకతవకలు జరిగాయని అంటోంది, ప్రత్యేకంగా విచారణకు కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే విచారణ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై ఆయా సంస్థలు తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ కు విచారణ అర్హత లేదని చెబుతున్నారు. కానీ ఇప్పుడు కోర్టు, విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.

Tags:    
Advertisement

Similar News