తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. జూన్ లో మెయిన్స్

ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. 25,050 మంది మెయిన్స్ కి ఎంపికయ్యారు.

Advertisement
Update:2023-01-14 05:04 IST

సంక్రాంతికి ముందే తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త తెలిపింది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC). శుక్రవారం రాత్రి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,050 మందిని మెయిన్స్ కి ఎంపిక చేశారు. అభ్యర్థుల హాల్‌ టికెట్‌ నెంబర్లతో కూడిన జాబితాను TSPSC వెబ్ సైట్ లో పెట్టింది.

ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2,85,916 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 25,050 మంది మెయిన్స్ కి ఎంపికయ్యారు. మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్‌ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా.. నేరుగా 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఒకే మార్కులు వచ్చినవారిలో స్థానికత ప్రకారం అర్హతను ఖరారు చేశారు. స్థానికత కూడా సమానంగా ఉంటే వయసుని పరిగణలోకి తీసుకున్నారు.

జూన్ లో మెయిన్స్..

జూన్‌ లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించబోతున్నట్టు TSPSC ప్రకటించింది. మెయిన్స్‌ పరీక్ష విధానంపై ఈనెల 18న పూర్తి వివరాలతో ప్రకటన వెలువడుతుంది. హైకోర్టు ఆదేశాలతో సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు TSPSC తెలిపింది. ఫలితాలకు సంబంధించి అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే TSPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్ లో సంప్రదించాలని సూచించారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News