పేదల ఇళ్లకు మరమ్మతులు.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఒక ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను మరొక ప్రభుత్వం పట్టించుకోవడం చాలా అరుదు. కావాలంటే తమ పేరు హైలైట్ అయ్యేలా కొత్త ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ బీఆర్ఎస్ సర్కారు మాత్రం పేదలకోసం ఇళ్ల మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించింది.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పేదలకోసం నిర్మించిన జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం., వాంబే కాలనీల్లో ఉన్న ఇళ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించింది. ఈమేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్‌ఎండీఏ సమకూర్చిన ఈ నిధులతో జీహెచ్ఎంసీ మరమ్మతులు చేపట్టబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఎందుకంటే..?
పేదలకు ప్రభుత్వాలు ఇళ్లు కట్టి ఇస్తుంటాయి. కానీ వాటి మరమ్మతులను మాత్రం ఎవరూ పట్టించుకోరు. యజమానులు కూడా మరమ్మతులు చేయించుకునే స్థోమత లేక వాటిని అలాగే వదిలేస్తారు. దీంతో కొన్ని ఇళ్లు నివాసానికి పనికిరావు. అలాంటి చోట్ల ప్రభుత్వమే సొంత ఖర్చుతో మరమ్మతులు చేస్తే, పేదలకు అంతకంటే ఇంకేం కావాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. పేదల ఇళ్లకు ప్రభుత్వ ఖర్చుతో మరమ్మతులకు సిద్ధమైంది. కొద్ది స్థాయిలో నిధులతో వేల సంఖ్యలో పేదలకు లబ్ధి చేకూరుతుందంటే ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడదని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.100 కోట్లు నిధులు కేటాయించామని చెప్పారు. నగరంలోని జంగంమెట్, బండ్లగూడతోపాటు పలు ప్రాంతాల్లోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం, వాంబే కాలనీల్లో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతులు పూర్తి చేస్తారని తెలిపారు.
ఒక ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను మరొక ప్రభుత్వం పట్టించుకోవడం చాలా అరుదు. కావాలంటే తమ పేరు హైలైట్ అయ్యేలా కొత్త ఇళ్ల నిర్మాణాలకు పూనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ బీఆర్ఎస్ సర్కారు మాత్రం పేదలకోసం ఇళ్ల మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించింది. ఇలా పేదల ఇళ్లకు ప్రభుత్వమే మరమ్మతులు చేయించడం బహుశా దేశంలో ఇదే మొదటిసారి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.