బీఆర్‌ఎస్ కన్నా మేమే ఎక్కువ ఉద్యోగాలిచ్చాం
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన ఉద్యోగాలకన్నా ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఉద్యోగాలిచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, ఇతర ముఖ్య నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందించడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 50 వేల ఉద్యోగాలిస్తే.. తాము ఏడాదిలోనే 45 వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. అభివృద్ధిలోనూ బీఆర్‌ఎస్ కన్నా తామే ఎక్కువ చేశామన్నారు. రూ.18 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తోంది కానీ చెప్పుకోలేకపోతుందన్నారు. జ్యోతిరావు ఫూలే మార్గదర్శకత్వంలో రాహుల్ గాంధీ పని చేస్తున్నారని దీపాదాస్ మున్షీ అన్నారు. ఆయన ఆలోచనతోనే కుల గణన చేపట్టామని తెలిపారు.