తెలంగాణలో వీఆర్వోలకు మంచి రోజులు..
తెలంగాణ వ్యాప్తంగా 6,874 వీఆర్వో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 5,385 మంది పనిచేస్తున్నారు. వీరంతా ఇతర శాఖల్లోకి బదిలీ అవుతారు. లాటరీ పద్ధతిలో శాఖల కేటాయింపు జరుగుతుంది.
దాదాపుగా రెండేళ్లపాటు ఖాళీగా ఉన్నారు తెలంగాణలో వీఆర్వోలు, వీఆర్ఏలు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న వీరిని.. ఆ శాఖ కాకుండా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు చెప్పింది. వీఆర్వోలను కొత్త శాఖల్లో తిరిగి నియమించే అధికారాన్ని పూర్తిగా కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటికే జిల్లాలవారీగా వీఆర్వోల జాబితా, ఇతర శాఖల్లోని ఖాళీల వివరాలతో సమగ్ర నివేదికలు తయారయ్యాయి. వాటి ద్వారా త్వరలో సర్దుబాటు జరుగుతుందని చెబుతున్నారు ఉన్నతాధికారులు.
రెవెన్యూలో ప్రక్షాళణ..
రెవెన్యూలో అవినీతిని రూపుమాపేందుకు 22 నెలల క్రితం వీఆర్వో వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. వీఆర్వోల స్థాయిలో జరగాల్సిన పనులన్నీ.. ఆపై అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ధరణి పోర్టల్ ని ప్రత్యామ్నాయంగా తీసుకురావడంతో పాలన పారదర్శకంగా మారిందని అంటున్నారు నేతలు. కానీ క్షేత్ర స్థాయిలో ధరణి పోర్టల్ తో కొన్ని ఇబ్బందులున్నాయనేది ప్రతిపక్షాల వాదన. అటు రెవెన్యూ సంఘాలు కూడా వీఆర్వో వ్యవస్థ రద్దుని తీవ్రంగా వ్యతిరేకించాయి. చివరకు చేసేదేం లేక ప్రభుత్వ ఉత్తర్వులను శిరసావహించాల్సిన పరిస్థితి. కానీ 22 నెలలుగా వీఆర్వోలు జీతాలు తీసుకుంటున్నా వారికి స్థిరమైన విధులను కేటాయించలేదు. తాజాగా ఉద్యోగాల సర్దుబాటులో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా 6,874 వీఆర్వో పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 5,385 మంది పనిచేస్తున్నారు. వీరంతా ఇతర శాఖల్లోకి బదిలీ అవుతారు. లాటరీ పద్ధతిలో శాఖల కేటాయింపు జరుగుతుంది. అదే జిల్లాలో పోస్టులు లేకపోతే పక్క జిల్లాలకు సర్దుబాటు చేస్తారు. కొత్త శాఖలకు కేటాయించిన తర్వాత కలెక్టర్ రీ-అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు ఇస్తారు. వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, బీసీ సంక్షేమం, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక, ఆరోగ్య, విద్య, పౌరసరఫరాలు, పోలీస్, గిరిజన సంక్షేమం, మహిళాభివృద్ధి శాఖల్లో వీరిని సర్దుబాటు చేయబోతున్నారు. అయితే రెవెన్యూ సంఘాలు మాత్రం లాటరీ పద్ధతి వద్దు, సీనియార్టీని బేస్ చేసుకుని ఆయా శాఖల్లోకి పంపించాలని కోరుతున్నాయి. రెవెన్యూ శాఖలో సైతం ఖాళీలున్నాయని, జూనియర్ అసిస్టెంట్లు, అడిషనల్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని, కనీసం కొంతమందినైనా ఆయా పోస్టుల్లో నియమించాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.