విద్యుత్ చట్టంపై అమిత్ షా కు షాకిచ్చిన తెలంగాణ రైతులు

తెలంగాణ రైతులు అమిత్ షాకు షాక్ ఇచ్చారు. మునుగోడు సభ కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా బేగం పేట ఎయిర్ పోర్ట్ లో రైతులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో రైతులు కేంద్రం తీసుకవచ్చిన విద్యుత్ చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అసహనానికి గురైన అమిత్ షా చట్టం మార్చడం కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చండి అంటూ రైతులతో అన్నాడు.

Advertisement
Update:2022-08-21 17:05 IST

మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా కొందరు రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్ చట్టం వెనక్కి తీసుకోవాలని, లేదా మార్చాలని కోరారు. అలాగే పంట బీమాను కూడా ప్రవేశ పెట్టాలని కోరారు. అయితే అమిత్ షా మాత్రం విద్యుత్ చట్టాన్ని మార్చడం కాదు ఇక్కడ ప్రభుత్వాన్నిమార్చండి రైతులకు చెప్పినట్టు రైతులు చెప్తున్నారు.

తాము తమ సమస్యల పరిష్కారం కోసం అడిగితే ఆయనేమో రాజకీయాలు మాట్లాడారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రైతులు చెప్పిన సమస్యలపై కాక ప్రధానంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ పైనే మాట్లాడారని రైతులు తెలిపారు.

కాగా అమిత్ షా ప్రధానంగా రైతులతో ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించే మాట్లాడారు. ఆ రకమైన వ్యవసాయం చేస్తున్న రైతులతోనే చర్చలు జరిపారు. అయితే విద్యుత్ చట్టం, మోటార్లకు మీటర్లు తదితర అంశాలను రైతులు ప్రశ్నిస్తే అమిత్ షా అసహనానికి గురైనట్టు రైతులు చెప్తున్నారు.

రైతులతో అమిత్ షా మాట్లాడిన మాట‌లు ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్ గా రావడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విద్యుత్ చట్టంపై చర్చనే జరగలేదని ఆయన అన్నారు. టీఆరెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని, దాన్ని మీరు ప్రచారం చేయడం సరైంది కాదని మీడియాకు హితవు పలికారు. అమిత్ షా అలా అన్న విషయం రైతులే చెప్తున్నారు అని మీడియా ప్రతినిధులు చెప్పగా ఏ రైతులు అని గద్దిస్తూ మాట్లాడిన బండి సంజయ్ మరో ప్రశ్న అడగనివ్వకుండా వెళ్ళిపోయారు. 

Tags:    
Advertisement

Similar News