తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఉద్యోగుల సమ్మె విరమణ

జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ఆర్టిజన్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Advertisement
Update:2023-04-26 17:21 IST

తెలంణాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఉద్యోగుల సమ్మె విరమణ

తెలంగాణ విద్యుత్ శాఖలో నిన్న మొదలైన సమ్మెను విరమిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్‌లో పని చేస్తున్న ఆర్టిజన్స్ (సంస్థలో విలీనం అయిన కాంట్రాక్ట్ ఎంప్లాయిస్) పలు డిమాండ్లను ముందు పెట్టి సమ్మెకు పిలుపునిచ్చారు. ఆయా విద్యుత్ సంస్థల్లో పని చేస్తూ.. ఐడీ నెంబర్లు కలిగి ఉన్న వారందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కొత్తగా నియమించబడిన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలని కూడా కోరుతున్నారు.

ప్రస్తుతం ఆయా సంస్థల్లో ఉన్న ఆర్టిజన్ కార్మికుల స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి.. ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరుతున్నారు. అయితే విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉండే వేసవి కాలంలో సమయంలో సమ్మె చేయడం సరి కాదని, ఏవైనా డిమాండ్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. అయినా సరే కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నది.

గతంలో కాంట్రాక్టు ఉద్యోగులగా పని చేస్తున్న వారిని సీఎం కేసీఆర్ 2016లో ఆర్టిజన్లుగా ఆయా సంస్థల్లోకి విలీనం చేశారు. గతంలో కేవలం రూ.4 వేలకే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్న వారిని.. సంస్థలో విలీనం చేసి రూ. 16 వేల వేతనం ఇచ్చేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో 2022 ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీపై నాలుగు రోజుల క్రితమే ఉద్యోగ, కార్మిక సంఘాలు.. విద్యుత్ యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరింది. పర్మనెంట్, ఆర్టిజన్ ఉద్యోగులందరికీ 7 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. అయినా సరే కొన్ని కార్మిక సంఘాలు ఆర్టిజన్లను తప్పుదోవ పట్టించి సమ్మె బాట పట్టించాయి.

తాజాగా జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ఆర్టిజన్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా తొలగించిన 200 మంది ఉద్యోగులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. దీంతో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి యధావిధిగా విధుల్లోకి హాజరవుతుండటంతో.. ఇక విద్యుత్ సరఫరాకు సంబంధించి ఆటంకాలు ఉండవని సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News