న్యాయవ్యవస్థపై నమ్మకం లేదా..? విచారణ అడిగింది మీరే కదా..!

ఇందిరాగాంధీ లాంటి నేతలే విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారని గుర్తుచేశారు భట్టి విక్రమార్క. అసలు న్యాయ విచారణ కోరింది కూడా బీఆర్ఎస్ నేతలేనని చెప్పారు.

Advertisement
Update:2024-06-17 13:18 IST

విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కక్షపూరిత ధోరణితోనే తనకు నోటీసులిచ్చారని, అలాంటి నోటీసులిచ్చిన జస్టిస్ నరసింహారెడ్డి, విచారణ కమిషన్ అధికారిగా ఉంటే దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని ఇటీవల కేసీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే. విచారణ కమిషన్ అధికారిగా ఉన్న నరసింహారెడ్డి ఆ బాధ్యతలనుంచి తప్పుకోవాలని కూడా కేసీఆర్ తన లేఖలో కోరారు. దీంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. విచారణ అధికారినే పక్కకు తప్పుకోవాలని అడగడం సరికాదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మేం చెప్పిందే వేదం, మేం చేసిందే శాసనం అంటున్న కేసీఆర్ కి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్టుగా తాము భావిస్తున్నామని అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

విచారణకు ఆదేశించడం వరకే ప్రభుత్వం బాధ్యత అని, ఆ తర్వాత ఎవర్ని పిలుస్తారు, ఎలా విచారిస్తారు అనే అంశాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు భట్టి విక్రమార్క. విచారణకు రాజకీయాలను జోడించడం సరికాదని చెప్పారు. ఎవరు హాజరు కాకపోయినా న్యాయవ్యవస్థ చూసుకుంటుందన్నారు భట్టి. కక్షసాధింపు ధోరణితో జ్యుడీషియల్‌ విచారణ చేస్తున్నారంటూ ఎవరైనా మాట్లాడితే అది వారి అవగాహన రాహిత్యం అని అన్నారాయన.

మీరే కదా..?

విద్యుత్‌ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని అడిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే, విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. తమ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన సందర్భంలో జగదీష్ రెడ్డి న్యాయ విచారణకు డిమాండ్ చేశారని, అందుకే తాము పారదర్శకంగా ఉండేందుకు విచారణ చేపట్టామని తెలిపారు. మరోవైపు ఆ పార్టీ నేతలే కక్షసాధింపు అంటున్నారని.. వారిలో వారికే కక్షసాధింపులు ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు భట్టి. ఇందిరాగాంధీ లాంటి నేతలే విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారని గుర్తుచేశారు.

Tags:    
Advertisement

Similar News