ఉద్యమకారులకు తప్పని ఎదురుచూపులు..!
సూర్యాపేట టికెట్‌ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఇవ్వకపోతే.. ఆ ఎఫెక్ట్ తుంగతుర్తిపైన పడే అవకాశాలున్నాయని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో సూర్యాపేటతో పాటు తుంగతుర్తి స్థానాలు పెండింగ్‌లో ఉంచింది అధిష్టానం.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్యమకారులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి. సోమవారం రిలీజ్ చేసిన మూడో జాబితాలోనూ వారికి చోటు దక్కలేదు. ప్రధానంగా అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, బెల్లయ్య నాయక్ లాంటి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిలో బెల్లయ్య నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పోటీకి దూరమైనట్లే. ఆయన మహబూబబాద్ లేదా ఇల్లందు స్థానాలు కోరగా.. ఇప్పటికే ఆ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలింది మరో నాలుగు స్థానాలే కావడంతో అవకాశాలు దక్కడం దాదాపు ఆసాధ్యమనే తెలుస్తోంది.
అద్దంకి దయాకర్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత రెండు పర్యాయాలు తుంగతుర్తి స్థానం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన అద్దంకి.. ఈసారి టికెట్ కోసం చివరి క్షణం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుంగతుర్తి టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పలువురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సూర్యాపేట టికెట్ అంశంతో తుంగతుర్తి ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట టికెట్‌ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఇవ్వకపోతే.. ఆ ఎఫెక్ట్ తుంగతుర్తిపైన పడే అవకాశాలున్నాయని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో సూర్యాపేటతో పాటు తుంగతుర్తి స్థానాలు పెండింగ్‌లో ఉంచింది అధిష్టానం.
ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన పిడమర్తి రవి ఆశలన్ని ఇప్పుడు తుంగతుర్తిపైనే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పిడమర్తి ఈసారి తుంగతుర్తి లేదా కంటోన్మెంట్ స్థానాల నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే కంటోన్మెంట్ స్థానంలో గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ అవకాశమిచ్చింది. ఇక మిగిలింది తుంగతుర్తి మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో పిడమర్తికి తుంగతుర్తి దక్కడం అనుమానమే.
ఇక సత్తుపల్లి నుంచి పోటీకి దిగాలనుకున్న మానవతారాయ్ ఆశలపైనా నీళ్లు చల్లింది. సత్తుపల్లి నుంచి మట్టా రాగమయికి అవకాశం కల్పించింది. వీరితో పాటు పార్టీ అనుబంధ సంఘాల నేతలకు టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్. బల్మూర్ వెంకట్, కేతూరి వెంకటేశ్, కోట శ్రీనివాస్, శివసేనా రెడ్డి ఇలా కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడిన వారి జాబితా పెద్దదిగానే ఉంది.