రేవంత్ సర్కారు సెంచరీ.. ప్రగతి నివేదిక విడుదల
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో ఐదింటిని అమలు చేశామని చెబుతోంది. ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టామని ప్రగతి నివేదికలో పేర్కొంది.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటితో(మార్చి15) 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటోంది. వాస్తవానికి నెల, 2 నెలలు, 100 రోజులు.. ఇలాంటి లెక్కల్ని ఎవరూ పట్టించుకోరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విషయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక తనకు తానుగా 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకుంది. అందుకే ఈ 100 డేస్ వారికి కీలకంగా మారింది. 100 రోజుల పాలనపై ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.
100 రోజులు 5 గ్యారెంటీలు..
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో ఐదింటిని అమలు చేశామని చెబుతోంది. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ‘మహాలక్ష్మి’ పథకాన్ని మొదలు పెట్టామని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని చెబుతున్నారు నేతలు. 23 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందారని, జీరో టికెట్ తో ఉచిత ప్రయాణం చేశారని లెక్కలు చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్ రాయితీ కూడా మహాలక్ష్మిలో భాగమే. గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లు కూడా ఇటీవలే అమలులోకి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా ఇటీవలే శ్రీకారం చుట్టారు. రైతు భరోసా ఎలాగూ అమలులో ఉంది. చేయూత అనే హామీలో సగం అమలైంది. పెన్షన్ల పెంపుకి కొత్త రేషన్ కార్డులు ముడిపెట్టడంతో అది ఆలస్యమైంది. అందులోని సబ్ సెక్షన్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమలులోకి వచ్చింది కాబట్టి చేయూతని కూడా 100 డేస్ విక్టరీలో నమోదు చేశారు. యువతకు విద్యా భరోసా కార్డు, ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణం వంటి హామీలున్న యువ వికాసం గ్యారెంటీ ప్రస్తుతానికి పట్టాలెక్కలేదనే చెప్పాలి. హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా ఐదు గ్యారెంటీలు మొదలు పెట్టేశామని తమ పని పూర్తి చేశామని కాంగ్రెస్ చెప్పుకోవడం విశేషం.
ఆరు గ్యారెంటీలతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టామని ప్రగతి నివేదికలో పేర్కొంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా భవన్ వేదికగా ప్రజావాణి ఏర్పాటు చేశామని, గతంలో జరిగిన అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలిసేలా శ్వేత పత్రాలు విడుదల చేసి, విచారణలు చేపట్టామని, విచారణలకోసం కమిషన్లు ఏర్పాటు చేశామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ల సమస్యకు పరిష్కారం, డబుల్ డెక్కర్ కారిడార్ కు పునాదిరాయి, మెట్రో ఫేజ్-2 విస్తరణకు శంకుస్థాపన, ప్రభుత్వ ఐటీఐల్లో ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల’ ఏర్పాటుకు ఒప్పందం, దావోస్ నుంచి పెట్టుబడులు, 30వేల ఉద్యోగాలు, ధరణి సమస్యల పరిష్కారానికి కమీటి, మూసీ పునరుద్ధరణకు ప్రతిపాదనలు, సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా చెల్లింపు, హైకోర్టు నూతన భవనానికి స్థలం కేటాయింపు, రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్-2050, నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు, జాబ్ క్యాలెండర్ అమలుకు ప్రయత్నాలు, టీఎస్పీఎస్సీ బోర్డ్ ప్రక్షాళన, నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలు.. ఇలా వీటన్నిటినీ తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్.
ప్రతిపక్షాలేమంటున్నాయి..?
వందరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇదివరకే తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ కూడా 100రోజుల్లో కాంగ్రెస్ సాధించిందేమీ లేదని, ఆరు గ్యారెంటీల అమలులో కొత్త ప్రభుత్వం ఫెయిలైందని అంటోంది. కాంగ్రెస్ విడుదల చేసిన ప్రగతి నివేదిక పరిశీలించాక ప్రతిపక్షాల ఘాటు విమర్శలు ఈరోజు బయటకొచ్చే అవకాశముంది.