ఇది కర్నాటక కాదు, తెలంగాణ.. గాంధీ భవన్ లో మొదలైన మంట

అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఎమ్మెల్యే సీట్లు కావాలని గొడవ చేస్తున్న ఓబీసీ వర్గానికి ఆ 26లో దక్కింది కేవలం 6 స్థానాలు మాత్రమే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల్లో బీసీలకు ఎన్నిసీట్లిస్తారో అని ఆ వర్గం నేతలు కస్సుమంటున్నారు.

Advertisement
Update:2023-07-22 16:50 IST

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సీఎం సీటు ఆశించిన డీకే శివకుమార్, అధిష్టానం నచ్చజెప్పడంతో సర్దుకు పోయారు. అదే పరిస్థితి తెలంగాణలో వస్తే, నేతల తీరు ఎలా ఉండేదో ఆలోచించడానికే కష్టం. ఎన్నికల తర్వాత కాదు, ఎన్నికలకు ముందే జుట్టు జుట్టు పట్టుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తాజాగా ప్రకటించిన ఎన్నికల కమిటీతో ఈ కుమ్ములాట మొదలైంది.

బీసీల ఆగ్రహం..

గతంలో 46మందితో ఎన్నికల కమిటీ వేసి అందరినీ సంతృప్తి పరచింది అధిష్టానం. కానీ ఈసారి కేవలం 26మందికే బాధ్యతలు అప్పగించారు. ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులు అదనం. విచిత్రం ఏంటంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఎమ్మెల్యే సీట్లు కావాలని గొడవ చేస్తున్న ఓబీసీ వర్గానికి ఆ 26లో దక్కింది కేవలం 6 స్థానాలు మాత్రమే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల్లో బీసీలకు ఎన్నిసీట్లిస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే బీసీ నేతలు కస్సుమంటున్నారు. కరీంనగర్ లో తలపెట్టిన బీసీ బహిరంగ సభపై కూడా ఈ ప్రభావం పడే అవకాశముంది. కమిటీలో అన్యాయం జరిగిందని కొందరు బీసీ నేతలు ఈ సభకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

మండల స్థాయి, ఎన్నారై కమిటీలతోనూ రచ్చ..

ఆమధ్య ప్రకటించిన మండలస్థాయి కమిటీలు, ఎన్నారై కమిటీలు కూడా కాంగ్రెస్ లో గొడవలకు కారణం అయ్యాయి. మండల కమిటీల్లో స్థానం దక్కనివారు గాంధీ భవన్ కు వచ్చి గొడవ చేశారు. కొంతమంది వారిని గాంధీ భవన్ పైకి పంపి మరీ హడావిడి సృష్టించారు. ఓ దశలో అలాంటి వారందర్నీ సస్పెండ్ చేస్తానంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిటీతో ఈ గొడవ మరింత ముదిరింది.

ఆ అపవాదు కూడా..

తెలంగాణలో ఉన్నది వైఎస్సార్ నాటి కాంగ్రెస్ కాదని, చంద్రబాబు కాంగ్రెస్ అంటూ ఆమధ్య బీఆర్ఎస్ వెటకారం చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే.. టీడీపీలో నుంచి వచ్చిన వారికి కమిటీల్లో అధిక ప్రాధాన్యం దక్కిందంటూ సీనియర్ నేతలు వాపోతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి.. తనతోపాటు ఆ పార్టీనుంచి వచ్చినవారితోనే కమిటీలు నింపేశారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉన్న సీనియర్లకు ప్రాధాన్యత దక్కుతుందని, వారికి అన్యాయం జరగదని గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని వారు గుర్తు చేస్తున్నారు. రాహుల్ ని కాదని, రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, చిన్నారెడ్డి, దామోదర్ రెడ్డి.. వంటి సీనియర్లను పక్కనపెట్టడం సరికాదంటున్నారు మరికొంతమంది నేతలు. ఎన్నికల కమిటీ వంటి ముఖ్యమైన విషయాల్లో కూడా విధేయులు, సీనియర్లను పక్కనపెట్టడం పార్టీకి నష్టం కలిగించే చర్య అని మండిపడ్డారు. మొత్తమ్మీద ఎన్నికలకు ముందే తెలంగాణ కాంగ్రెస్ రోడ్డునపడింది. కమిటీ అలకల వ్యవహారం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అసంతృప్తవాదుల్ని అధిష్టానం బుజ్జగిస్తుందా లేక హెచ్చరిస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News