సొంత బలం పెంచుకుందాం.. బీజేపీ కొత్త స్కెచ్

తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నది వాస్తవమే. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు.

Advertisement
Update:2022-11-08 10:07 IST

తెలంగాణ బీజేపీ మునుగోడు ఓటమిని సీరియస్‌గా తీసుకోలేదు. పైగా, ఇతర పార్టీల్లో చరిష్మా ఉన్న నాయకులను తీసుకొని వస్తే తప్పకుండా అధికార టీఆర్ఎస్‌కు పోటీ ఇవ్వొచ్చనే కొత్త పాఠాన్ని నేర్చుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర నాయకులే చెబుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన పలు ఉపఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఇలాగే ఉన్నది. రాష్ట్రంలో మంచి చరిష్మా ఉన్న నాయకులను తమ పార్టీలో చేర్చుకొని దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ సీట్లను కొల్లగొట్టింది. ఇక మునుగోడులో దాదాపు గెలిచినంత పని చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే వ్యూహానికి ఈ మూడు ఉపఎన్నికలు ఉపయోగపడ్డాయి.

తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరన్నది వాస్తవమే. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు. జీహెచ్ఎంసీతో పాటు నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల పరిధిలో తప్ప.. బీజేపీకి అభ్యర్థులు దొరకడం కష్టంగానే ఉన్నది. వరంగల్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో బీజేపీకి కాస్తో కూస్తో పలుకుబడి ఉన్నది. కానీ దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ ఊసే లేదు. మునుగోడులో గెలిస్తే నల్లగొండలో చక్రం తిప్పాలని భావించింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఆ పార్టీ తమ ఉనికిని చాటుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నాయకులు మహబూబ్‌నగర్‌లో ఉన్నా.. వాళ్లు ఎంత మేరకు కొత్త అభ్యర్థులను తయారు చేస్తారన్నది అనుమానంగా ఉన్నది. ఇప్పటి వరకు ఆ ఇద్దరు నాయకులు కొత్తగా బీజేపీలోకి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను తీసుకొని వచ్చింది లేదు.

ఇక నల్లగొండ జిల్లాలో బీజేపీ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పని చేసినా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఇంత ప్రభావం చూపలేరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులు ఇతర నియోజకవర్గాల్లో ప్రభావం చూపలేరని గ్రహించిన బీజేపీ.. కొత్త స్కెచ్ వేస్తోంది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలంగా ఉండి.. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీలోకి తీసుకోవాలని భావిస్తున్నది. ఒకవైపు టీఆర్ఎస్ నేతలను ఆకర్షిస్తూనే... ఇతర పార్టీ నేతలకు కూడా గాలం వేస్తున్నది.

ఇటీవల ఖమ్మం, వరంగల్ జిల్లాలపై బీజేపీ ఫోకస్ చేసినట్లు కనపడుతున్నది. మునుగోడులో గెలిస్తే ఆయా జిల్లాలలోని కీలక నేతలను పార్టీలోకి గుంజేయాలని భావించింది. కానీ అక్కడి ఓటమి ఇప్పుడు చేరికలపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా సంక్రాంతి తర్వాత బీజేపీలోకి పలు పార్టీల్లోని అసంతృప్త నేతలను చేర్చుకోవడానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. మునుగోడులో ఓడినా.. తాము మాత్రమే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని చెప్పుకుంటూ.. బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన 10 మంది కీలక నేతలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది. వీరంతా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారే కావడం గమనార్హం.

తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గంలో బీజేపీ బలం పెంచే నాయకులు ఉండాల్సిన అవసరం ఉందని.. అందుకే అలాంటి నాయకుల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల్లో సొంత బలంతో గెలిచే నాయకులనే పార్టీలోకి తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఉపఎన్నిక కాబట్టి అందరూ మునుగోడుపై ఫోకస్ చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి.. సాధ్యమైనంత మేరకు బలమైన నాయకులను పెంచుకోవడమే మంచిదనే నిర్ణయానికి పార్టీ వచ్చింది. ఇప్పటికే అధిష్టానం కూడా అలాంటి బలమైన వ్యక్తులనే పార్టీలోకి తీసుకోవాలని ఆదేశించింది. నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపని నాయకులను తీసుకొని టికెట్ల లొల్లి పెట్టుకోవద్దని, ఇప్పటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకునే వారినే పార్టీలోకి తీసుకోవాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తున్నది. దీంతో తెలంగాణ బీజేపీ నాయకులు పార్టీ బలాన్నిపెంచే ఇతర పార్టీ నాయకుల కోసం అన్వేషణ ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News