కేసీఆర్ నిర్ణయంతో రూటు మార్చిన బీజేపీ.. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం!

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం కావడంతో రూటు మార్చింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది.

Advertisement
Update:2022-11-16 07:58 IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు సీఎం కేసీఆర్ తెరదించారు. రాబోయే 10 నెలలు అందరం కష్టపడదామని, ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.. అందుకే ఇప్పటి నుంచే సన్నద్దం కావల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఈ పది నెలలు చాలా కీలకమని, ప్రతీ ఒక్కరం కష్టపడితే గెలుపు సులువు అవుతుందని దిశా నిర్దేశనం చేశారు. ముందస్తుపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి సీఎం కేసీఆర్ ప్రకటన నీళ్లు చల్లినట్లయ్యింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బీజేపీ అంచనా వేసింది. అప్పటికి కీలకమైన రాష్ట్రాల ఎన్నికలు ఏవీ ఉండవు. కాబట్టి జాతీయ నాయకత్వం కూడా పూర్తిగా తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని బీజేపీ భావించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలోకి లాగేసి.. తెలంగాణలో అధికారం సాధించేద్దాం అనే ఊహల్లో తేలింది. అంతే కాకుండా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేస్తే.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టి ఒక ఆటాడుకోవాలని కూడా భావించింది. కానీ బీజేపీ నాయకుల ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఇక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం కావడంతో రూటు మార్చింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. తాజాగా రాష్ట్రంలోని 80 అసెంబ్లీ నియోజక వర్గాలకు పార్టీ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను నియమించింది. ఆ మేరకు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రతీ నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేయడమే వీరి లక్ష్యం. వీళ్లందరూ వెంటనే బూత్ స్థాయి నుంచి బలమైన క్యాడర్‌ను ఏర్పాటు చేసుకోవాలని పార్టీ ఆదేశించింది.

బీజేపీని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఈ నెల 19న పార్లమెంట్ కన్వీనర్ల మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. రాబోయే 10 నెలలు ప్రతీ నియోకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా తయారు చేసుకోవాలని భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లక పోవడం బీజేపీకి మేలు చేసిందనే చెప్పవచ్చు. మిగతా పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చుకునే బదులు.. ఇప్పటికే ఉన్న వారిని ఎన్నికలకు సన్నద్దం చేసే అవకాశం ఏర్పడింది.

బీజేపీ స్టేట్ ఇంచార్జి సునిల్ బన్సల్ కూడా అసెంబ్లీ ఎన్నికలపై వరుసగా మీటింగ్స్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ టికెట్స్ ఆశించే ప్రతీ ఒక్కరు ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. కనీసం నియోజకవర్గంలో బీజేపీ ఉన్నదనే విధంగా ప్రజలకు చేరువ కావాలని ఆదేశించారు. అలా కాకుండా హైదరాబాద్‌కే పరిమితం అయితే.. ఎన్నికల నాటికి ఓటర్లను చేరువ కావడం కష్టం అవుతుందని చెప్పారు.

దక్షిణ తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీకి సరైన క్షేత్ర స్థాయి క్యాడర్ లేదు. ఈ జిల్లాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలన్నీ కమ్యూనిస్టు పార్టీలే భుజాలకు ఎత్తుకున్నాయి. సింగరేణి బెల్టులో కూడా గణనీయంగా క్యాడర్‌ను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. వెంటనే ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెట్టాలని, సింగరేణిలో కూడా కార్మికులకు చేరువయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.

ఒకవైపు ఇతర పార్టీల నుంచి పాపులర్ నాయకులను బీజేపీలోకి తీసుకుంటూనే.. ఎక్కడికక్కడ కొత్త నాయకులను తయారు చేసే పనిలో బీజేపీ పడింది. అయితే 10 నెలల్లోనే ఇవన్నీ సాధ్యమా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాగా, దాదాపు 80 నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించారు. అక్కడ మాత్రం టీఆర్ఎస్‌కు ధీటుగా అభ్యర్థులను రెడీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికల నాటికి కొత్త పార్టీలతో పొత్తులు ఉంటే.. మిగిలిన సీట్లు వారికి ఇచ్చేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నది. ఏదేమైనా కేసీఆర్ ప్రకటనతో.. ఇక బీజేపీ కూడా బిజీ అయ్యింది. ఇన్నాళ్లూ దృష్టి పెట్టని నియోజకవర్గాలపై కూడా ఫోకస్ చేయాలని నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News