టీ-వర్క్స్‌తో ఫ్రాన్స్‌కు చెందిన డసో సిస్టమ్స్ కీలక ఒప్పందం

ఆవిష్కరణలు చేసే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా.. ఆ సవాళ్లను ఈ కేంద్రంలో అధిగమించవచ్చని అన్నారు.

Advertisement
Update:2023-07-20 08:20 IST

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ కంపెనీ డసో సిస్టమ్స్.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీ-వర్క్స్‌తో జట్టు కట్టింది. హైదరాబాద్‌లో టీ-వర్క్‌తో కలిసి స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయడానికి కీలక ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు బుధవారం ఇరు సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా టీ-వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి మాట్లాడుతూ..

టీ-వర్క్స్‌లో పలు రంగాలకు చెందిన స్టార్టప్‌లకు అవసరమైన 3డీ డిజైన్‌లు అందుబాటులోకి ఉంటాయని అన్నారు. స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రోటోటైప్‌లు రూపొందించి.. తర్వాత దశకు తీసుకెళ్లే క్రమంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. దీనికి సరైన పరిష్కార మార్గాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో లభిస్తాయని చెప్పారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో కూడిన ఈ కేంద్రం.. కొత్తగా వస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

డసో సిస్టమ్స్ ఇండియా ఎండీ దీపక్ ఎన్‌జీ మాట్లాడుతూ.. కొత్త తరం స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న 3డీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఆవిష్కరణలు చేసే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా.. ఆ సవాళ్లను ఈ కేంద్రంలో అధిగమించవచ్చని అన్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన డసో సిస్టమ్స్‌ 1981లో ప్రారంభం అయ్యింది. ఈ సంస్థ 3డీ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ మాక్అప్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ వంటి ఉత్పత్తులు చేపడుతుంది. డసో సిస్టమ్స్‌ను 3డీస్ అని కూడా పిలుస్తుంటారు. 90వ దశకంలో డసో సిస్టమ్స్ ఉత్పత్తి చేసిన 3డీ సాఫ్ట్‌వేర్‌ను విమానాల్లో ఉపయోగించేవారు. అప్పట్లో పదింట నాలుగు విమానాల్లో డసో సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉండేది. ఏవియేషన్, ఆటోమోటీవ్ రంగాల్లో డసో సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఎక్కువగా ఉపయోగిస్తారు.

హోండా, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, బోయింగ్‌ల ప్రొడక్ట్ డిజైన్ కోసం ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారు. బోయింగ్, ఫాల్కన్, రాఫెల్ విమానాల డిజైన్లను డసో సిస్టమ్స్‌కు చెందిన CATIA ద్వారా రూపొందించారు. వాటి ప్రోటోటైప్స్ తయారీతో పాటు డిజిటల్ మాక్అప్ కోసం క్యాడ్ ప్రోగ్రామ్ కాకుండా CATIA ఉపయోగించడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News