ఆహాలో టీశాట్ పాఠాలు.. ఆరో వార్షికోత్సవంలో మంత్రి కేటీఆర్

టీశాట్ తెలంగాణకే పరిమితం కాదని.. ప్రపంచంలో తెలుగు పిల్లలు ఎక్కడున్నా వారికి టీశాట్ ద్వారా ఉపయోగం కలిగేందుకు కృషి చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2023-07-27 12:51 IST

తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉన్న టీ-శాట్ టీవీ ఛానెల్స్ ఆరో వార్షికోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీశాట్ సీఈఓ శైలేష్ రెడ్డి సహా సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. టీశాట్ తో ఉస్మానియా యూనివర్శిటీ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో టీశాట్ పాఠాలు ఇకపై ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా అందుబాటులోకి వస్తాయని సీఈఓ శైలేష్ రెడ్డి ప్రకటించారు.

కరోనా కాలంలో టీశాట్ సేవలు అద్భుతం అని కొనియాడారు మంత్రి కేటీఆర్. టీశాట్ సహాయంతో కరోనా సమయంలో విద్యార్థులకు మేలు జరిగిందని చెప్పారు. టీశాట్-విద్య ద్వారా విద్యాబోధన జరుగుతోందని.. టీశాట్-నిపుణ ద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మేలు జరుగుతోందని చెప్పారు. టీశాట్ యాప్ లో ఇప్పటి వరకు 768 గంటల కంటెంట్ ఉందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు మంత్రి కేటీఆర్.


టీశాట్ తెలంగాణకే పరిమితం కాదని.. ప్రపంచంలో తెలుగు పిల్లలు ఎక్కడున్నా వారికి టీశాట్ ద్వారా ఉపయోగం కలిగేందుకు కృషి చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. ఎంటర్టైన్మెంట్ విధానంలో ఇన్ఫర్మేషన్ ను ఇవ్వగలిగితే మరింత ఉపయోగం ఉంటుందన్నారు. యానిమేషన్, మల్టీమీడియా కంపెనీల సహకారంతో పాఠాలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాలన్నారు. ఉద్యోగాలకోసం సిద్ధమయ్యే యువతకు మాక్ టెస్ట్ లు నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. దీనికోసం ఎలాంటి సపోర్ట్ కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News