అన్నీ మంచి శకునములే.. బీఆర్ఎస్ లో మరో విలీనం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీ లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు వనితా తాయి గుట్టే. స్వరాజ్య మహిళా సంఘటన ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే లక్ష్యంతో విలీన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Advertisement
Update:2023-08-17 06:30 IST

బీఆర్ఎస్ మహారాష్ట్ర శాఖ ఏ మహూర్తాన యాక్టివ్ అయ్యిందో కానీ.. చేరికలతో రోజు రోజుకీ బలం పుంజుకుంటోంది. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల కీలక నేతలతోపాటు.. కొన్ని పార్టీలు కూడా బీఆర్ఎస్ లో విలీనం అవుతుండటం విశేషం. స్వాతంత్ర దినోత్సవం రోజున క్రాంతికారి షేత్కారి పార్టీ బీఆర్ఎస్ లో విలీనం కాగా.. 24గంటల వ్యవధిలో ‘స్వరాజ్య మహిళా సంఘటన’ భారత్‌ రాష్ట్ర సమితిలో విలీనమైంది.

మహారాష్ట్రలో మహిళా సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ప్రముఖ మహిళా సంఘం ‘స్వరాజ్య మహిళా సంఘటన’. ఈ సంస్థ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే. మహిళల సమస్యలు పరిష్కారం కావాలంటే, వారికి రాజ్యాధికారం ఉండాలని బలంగా నమ్మే వ్యక్తి ఆమె. మహిళలకు ఆయా రాజకీయ పార్టీలు సముచిత స్థానం ఇవ్వాలంటూ తమ సంస్థ తరపున పోరాటం చేస్తుంటారు. పురుషులకు పోటీగా నిలబడిన మహిళా అభ్యర్థులకు మద్దతిస్తుంటారు. తాజాగా ఆమె తన మహిళా సంఘటనను బీఆర్ఎస్ లో విలీనం చేశారు. హైదరాబాద్‌ లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో స్వరాజ్య మహిళా అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే గులాబి కండువా కప్పుకున్నారు. ఆమెతోపాటు మరికొంతమంది మహిళా నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు.

తెలంగాణలో మహిళా అభ్యున్నతి, సంక్షేమం లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీ లోకాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు వనితా తాయి గుట్టే. మహారాష్ట్రలో పేదలు, నిస్సహాయులు, వితంతువుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే లక్ష్యంతో విలీన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విధానాలను ముందుకు తీసుకుపోతామని చెప్పారు. జీవితాంతం బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారామె. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని అన్నారామె.

బుల్ధానా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంఖడే, మరికొందరు బీజేపీ నేతలు, శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, ఎన్సీపీ తాలూకా ప్రెసిడెంట్ జయంత్ చౌదరి, కొందరు కార్పొరేటర్లు.. బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ.. మహారాష్ట్రలో కూడా తెలంగాణ మోడల్ కోసం కృషి చేస్తామన్నారు నాయకులు. 

Tags:    
Advertisement

Similar News