గ్రూప్-1 పిటిషన్ పై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ
హైకోర్టు తీర్పులో స్పష్టత ఉన్నదని ఈ నేపథ్యంలో తాము ఎక్కడా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు ఇటీవల సుప్రీంకోర్టు దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై నేడు సుప్రీంకోర్టులో వాదనలు విన్న సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జోక్యం చేసుకోవడానికి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ. తెలంగాణ హైకోర్టు ఈ కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని,దీని ప్రకారం చూస్తే హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఫలితాలు, నియామకాలు ఉంటాయి. హైకోర్టు తీర్పులో స్పష్టత ఉన్నదని ఈ నేపథ్యంలో తాము ఎక్కడా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్నారు. దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేస్తూ .. రాష్ట్ర హైకోర్టు తుది ఫలితాలకు ముందే ఈ కేసుపై పూర్తి విచారణ చేసి తీర్పు వెలువరించాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ రాష్ట్ర హైకోర్టుకు సూచించారు. నవంబర్ 20లో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ ముగించి తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. అనంతరమే తాము ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశాలు ఉంటే పరిశీలిస్తామన్నారు. అభ్యర్థులంతా గ్రూప్-1 మెయిన్స్‌కు సంసిద్ధులై పరీక్ష కేంద్రాలకు చేరుకున్న తర్వాత ఈసమయంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి గ్రూప్-1 జరుగుతున్నది కాబట్టి కొన్నివేల మంది ఈ సందర్భంగా నష్టపోతున్నారని.. అలాగే సుప్రీంకోర్టు గతంలో తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని తీసుకొచ్చిందని, ఆ మేరకు తమకు పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థుల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేశారు. సిబిల్ విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది.