అవాస్తవాలు చెప్పడం ఆపి పూర్తి రుణమాఫీ చేయండి
సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ
అవాస్తవాలు చెప్పడం మానేసి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిచేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన మోసపూరిత వ్యూహాలు దేశమంతా పాకినట్లు కనిపిస్తున్నది. ప్రజలను నమ్మించడానికి ముఖ్యమంత్రి రేవంత్ దేవుళ్లపై ప్రమాణం చేశారు. 31 రకాల షరతులు పెట్టి చాలామందిని రుణమాఫీకి దూరం చేశారు. ఎస్‌బీఐలోనే 50 శాతం రైతుల రుణాలు మాఫీ కాలేదని డేటా చెప్తున్నది. రూ. 2 లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని చాలామంది రైతులు చెల్లించారు. వెంటనే రుణమాఫీ పూర్తి చేయాలి అని హరీశ్ లేఖలో పేర్కొన్నారు.
లేఖలో ప్రస్తావించిన అంశాలు
1) కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9, 2023న పంట రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే 09-12-2023న పంట రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
2) కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో దాని గడువును పొడిగించింది. తెలంగాణ రైతుల నమ్మకం పొందడానికి ముఖ్యమంత్రి దైవసాక్షిగా 15-08-2024 నాటికి పంట రుణమాఫీ పూర్తి చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు.
3) ముఖ్యమంత్రి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ పూర్తి చేశామని చేసిన ప్రకటన పూర్తి అవాస్తవం. 25-09-2024న నేను దాఖలు చేసిన ఆర్టీఐ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అందించిన సమాచారం ఆధారంగా స్పష్టంగా తెలుస్తున్నది.
-రూ. ఒక లక్షలోపు రుణం ఉన్న రైతుల సంఖ్య 5,74,137 కాగా, 2,99,445 మంది రైతుల రుణం మాత్రమే మాఫీ అయింది.
-రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య 2,62,341 కాగా, ఇప్పటివరకు 1,30,915 మంది రైతుల రుణం మాత్రమే మాఫీ అయింది.
-రూ. 1.5 లక్షల నుండి 2 లక్షల మధ్య రుణం ఉన్న రైతుల సంఖ్య 1,65,607 కాగా, ఇప్పటివరకు 65,231 మంది రైతుల రుణం మాత్రమే మాఫీ అయింది.
ఎస్‌బీఐ నుంచి అందిన ఈ డేటా ప్రకారం, సుమారు 5.5 లక్షల రైతులు, అంటే సుమారు 50 శాతం రైతుల రుణం మాఫీ కాలేదు.ఇతర బ్యాంకులకూ దాదాపు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నది.
4) రూ. 2 లక్షలకు పై నున్న రుణాలను రైతులు చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రకటించారు. చాలామంది రైతులు పై మొత్తాన్ని చెల్లించారు. అయినప్పటికీ ఎస్‌బీఐ నివేదిక ప్రకారం రుణమాఫీ జరగలేదు.దురదృష్టవశాత్తూ, చాలా మంది రైతులు ముఖ్యమంత్రి మాటలను నమ్మి వారి పంట రుణం మాఫీకి అర్హులు కావడానికి ప్రైవేట్ రుణాలను అధిక వడ్డీకి తీసుకున్నారు. పంట రుణమాఫీకి 31 విభిన్న షరతులను పెట్టి చాలా మంది రైతులను అర్హతను కోల్పోయేలా చేశారు.
5) మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆరేళ్లుగా రూ. 72,000 కోట్లు రైతులకు "రైతు బంధు" ద్వారా అందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి దసరా ఇది. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదు.
రుణమాఫీ చేసినట్లు దేశం మొత్తం తప్పుడు ప్రచారం చేసే ముందు, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఆర్టీఐ సమాధానంతో పాటు రూ.2 లక్షలకు మించిన రుణాన్ని చెల్లించిన రైతుల బ్యాంకు కౌంటర్ ఫోయిల్స్ లేఖతో పాటు జత పరిచారు.
ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఆర్టీఐ సమాధానం కోసం కింది లింక్ క్లిక్ చేయండి
https://www.teluguglobal.com/pdf_upload/sbi-rti-1366808.pdf