ప్రాణం తీసిన వీకెండ్ సరదా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
35 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్నేహితులతో కలసి వికారాబాద్ అడ్వెంచర్ క్లబ్ కి వెళ్లాడు. రిసార్ట్ లో ట్రెజర్ హంట్ గేమ్ లో పాల్గొని చివరకు ప్రాణాలు వదిలాడు.
వీకెండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సిటీకి దూరంగా వెళ్తుంటారు. రిసార్టుల్లో సరదాగా గడిపి ఆదివారం రాత్రికి ఇంటికి చేరుకుంటారు. ఇలాంటి సరదా.. ఓ యువకుడి మృతికి కారణమైంది. వికారాబాద్ మండలం గోధుమ గూడ గ్రామంలోని అడ్వెంచర్ క్లబ్ రిసార్ట్ లో ట్రెజర్ హంట్ గేమ్ కి బలయ్యాడు సాయికుమార్. 35 ఏళ్ల ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స్నేహితులతో కలసి వికారాబాద్ అడ్వెంచర్ క్లబ్ కి వెళ్లాడు. అక్కడ ట్రెజర్ హంట్ గేమ్ లో పాల్గొన్నాడు. కనిపెట్టాల్సిన వస్తువుని నిర్వాహకులు అక్కడున్న ఓ నేలబావిలో ఉంచారు. క్లూ లు వెదుక్కుంటూ వెళ్లిన సాయికుమార్ బావిలో వస్తువు ఉందని గుర్తించి అందులో దూకాడు. ఈత రాకపోవడంతో ప్రాణాలు వదిలాడు.
రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే సాయికుమార్ బావిలో పడి మృతి చెందాడని తెలుస్తోంది. ట్రెజర్ హంట్ గేమ్ లో గెలవాలనే తపనతో చివరకు విధి చేతిలో ఓడిపోయాడు సాయికుమార్. బావి చుట్టూ సరైన వెలుతురు లేదు. చీకటిగా ఉండటంతో ఎవరికీ సాయికుమార్ ఆర్తనాదాలు వినిపించలేదు. చివరకు శవాన్ని బయటకు తీయాల్సి వచ్చింది.
సాయికుమార్ భార్య హైదరాబాద్ లోని శ్రేయాస్ మీడియా సంస్థ హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి. సాయికుమార్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి. స్నేహితులతో కలసి రిసార్ట్ కి వెళ్లిన సాయికుమార్ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీకెండ్ సరదాగా గడుపుదామని వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, చివరకు ఇలా శవమై తేలడం బాధాకరం.