టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ అధికారులు

ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రవీణ్.. అనితా రామచంద్రన్ వద్దనే పీఏగా పని చేశాడు.

Advertisement
Update:2023-04-01 17:08 IST

గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఇతర ప్రశ్నాపత్రాల లీక్ కేసులో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ, ఐఏఎస్ అధికారిణి అనితా రామచంద్రన్‌ను సిట్ అధికారులు విచారించారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రవీణ్ ఆమె వద్దనే పీఏగా పని చేశాడు. దీంతో శనివారం విచారణకు  హాజరుకావాలని సిట్ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు ఆమె నుంచి సమాచారాన్ని తీసుకొని స్టేట్మెంట్ రికార్డు చేశారు.

ప్రవీణ్‌కు సంబంధించే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తున్నది. అతడి వ్యవహారశైలి ఎలా ఉండేది? ఎప్పుడైనా అనుమానాస్పదంగా కనిపించాడా? అతడి ప్రవర్తనపై ఏనాడైనా డౌట్ వచ్చిందా? అని సిట్ అధికారులు అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ, భద్రత, ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా చేపడతారో పూర్తి వివరాలను సైతం సిట్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించిన యాక్సెస్ ఎవరెవరికి ఉంటుంది? ప్రశ్నాపత్రాలు రూపొందించిన వారి వివరాలు ఇంకా ఎవరికైనా తెలుస్తాయా? అనే సమాచారాన్ని కూడా అడిగినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.

పేపర్ లీకేజీ వ్యవహారంలో రూ. లక్షల కొద్దీ చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తున్నది. ఎంత డబ్బు చేతులు మారిందో అనే విషయాలను సిట్ అధికారులను అడిగినట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి తొలుత బేగంబజార్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సిట్ వీరిని అదుపులోకి తీసుకొని.. కొన్ని రోజుల నుంచి లోతుగా విచారిస్తోంది. 

Tags:    
Advertisement

Similar News