రేవంత్ రెడ్డిపై షర్మిల షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయకుండా అడ్డుకున్నారనే అనుమానం ఉన్న రేవంత్ రెడ్డిపై షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతు తెలిపినా కూడా ఆమె పూర్తిగా కాంగ్రెస్ నేతల గెలుపు కోసం కృషి చేస్తారని అనుకోలేం. అదే సమయంలో తనను కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకున్నారనే అనుమానం ఉన్న రేవంత్ రెడ్డిపై ఆమె ఇంకా సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఆమె మరోసారి తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టే దొంగ అన్నదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై ఉన్న కేసు కొట్టేయాలంటూ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుని కోరారని, అయితే సుప్రీం మాత్రం ఆ కేసు విచారణ జరపాలని చెప్పిందని, అంటే ఆయన దొంగ అని సుప్రీంకోర్టే చెప్పిందని అన్నారు షర్మిల. రేటెంత రెడ్డి అంటూ రేవంత్ కి కొంతమంది పేరు పెట్టారని, వారు కాంగ్రెస్ నేతలేనని చెప్పారు. ఆయనపై టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయని చెప్పారు. మొత్తమ్మీద షర్మిల కాంగ్రెస్ కి మద్దతిచ్చినా, రేవంత్ రెడ్డిపై తనకున్న కోపాన్ని మాత్రం ఇలా ప్రదర్శించారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని.. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
సజ్జలపై కూడా..
వైఎస్ జగన్ ను, వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఇబ్బందులు పెట్టిందని, ఇప్పుడు అదే కాంగ్రెస్ కి షర్మిల మద్దతివ్వడాన్ని ఆమె రాజకీయ నిర్ణయంగా చూస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీతో తమకు సంబంధం లేదని గతంలో సజ్జల అన్నారని.. ఇప్పుడు ఏ సంబంధం ఉందని ఆయన తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు షర్మిల. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో రోడ్లు, విద్యుత్ వ్యవస్థపై తెలంగాణ సీఎం కేసీఆర్ బాహాటంగానే విమర్శించారని, ఆయన వ్యాఖ్యలకు సజ్జల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీ కథ మీరు చూసుకోండి అంటూ సజ్జలకు బదులిచ్చారు షర్మిల.