ఇది సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్.. కేటీఆర్ ఆగ్రహం
20వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కి తరలించారని, తెలంగాణకు మాత్రం 520కోట్ల రూపాయల నిధులతో వ్యాగన్ రిపేర్ షెడ్ కేటాయించారని ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు మంత్రి కేటీఆర్.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ప్రధాన మంత్రిగా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత మోదీపై ఉందని, అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలా, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మరోలా చూడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణకు సెకండ్ క్లాస్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై మోదీ బహిరంగ వివరణ ఇవ్వాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వరంగల్ లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆ హామీ మూలన పడేశారని తెలంగాణకు నిరాశ కలిగించారన్నారు. ఆ ఫ్యాక్టరీని మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ కి తరలించారని గుర్తు చేశారు. 20వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రావాల్సిన ఫ్యాక్టరీని గుజరాత్ కి పంపించి తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. అదే సమయంలో తెలంగాణను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
20వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కి తరలించారని, తెలంగాణకు మాత్రం 520కోట్ల రూపాయల నిధులతో వ్యాగన్ రిపేర్ షెడ్ కేటాయించారని ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు మంత్రి కేటీఆర్. ఇది సెకండ్ క్లాస్ ట్రీట్మెంట్ కాక ఇంకేంటని ప్రశ్నించారు.