సరస్వతి బ్యారేజ్ వద్ద ఏం జరిగింది..? అధికారులు ఏమంటున్నారు..?

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండల పరిధిలో ఈ బ్యారేజ్ ఉంది. దీని నుంచి నీళ్లు లీకవుతున్నాయని, బుంగ పడిందని.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2023-11-02 06:40 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజ్ లో నీటి లీకేజీ అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు నీటిపారుదల శాఖ ఈఈ యాదగిరి. బ్యారేజ్ కి ఎలాంటి ప్రమాదం లేదని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండల పరిధిలో ఈ బ్యారేజ్ ఉంది. దీని నుంచి నీళ్లు లీకవుతున్నాయని, బుంగ పడిందని.. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాస్తవమేంటో అధికారులే చెబుతున్నారు.

బ్యారేజ్ వద్ద 1,275 మీటర్లతో పొడవుతో సీపేజ్‌ ఉంటుందని.. ప్రతి ఏడాదీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ ఉంటుందని, సీపేజ్‌ తగ్గినప్పుడు మెటల్, ఇసుక వేస్తున్నామన్నారు ఈఈ. పూర్తి నిర్వహణ బాధ్యత ఆప్కాన్ సంస్థది అని చెప్పారు. ప్రాజెక్టును అన్ని సమస్యలు తట్టుకునే విధంగానే డిజైన్‌ చేశామన్నారు. అవసరమైతే కెమికల్‌ గ్రౌటింగ్‌ కూడా చేస్తామన్నారు. ప్రస్తుతానికి అక్కడ సమస్య ఏదీ లేదని స్పష్టం చేశారు. రింగ్‌ బండ్‌ కి చేపట్టి మెయింటెనెన్స్‌ పనుల్లో బయటకు వచ్చే నీటిని చూసి బుంగ పడిందని సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైందని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పిల్లర్ కుంగిన ఉదాహరణ తీసుకుని ప్రతిపక్షాలు సరస్వతి బ్యారేజ్ పై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ బ్యారేజ్ లు పూర్తి చేసుకున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరందుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వివిధ బ్యారేజ్‌ లు, పంప్‌ హౌస్‌ ల నిర్మాణాలను వివిధ కంపెనీలకు అప్పగించారు. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం బ్యారేజ్ ల నిర్మాణంతోపాటు 15ఏళ్లపాటు వాటి మెయింటెనెన్స్ బాధ్యత కూడా ఆయా కంపెనీలదే. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్ వద్ద మెయింటెనెన్స్ పనులు జరుగుతుండగా.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News