బిజీగా మారిన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్.. గరిష్ట స్థాయిలో రాకపోకలు

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడంతో ఎయిర్ పోర్ట్ లతోపాటు, విమానయాన సంస్థలకు కూడా ఆదాయాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొవిడ్ ముందు పరిస్థితులను మించి రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Update:2023-02-19 09:14 IST

కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడానికి పెద్దగా సమయం పట్టలేదు. దాదాపుగా అన్ని రంగాల్లో పూర్వ స్థితికి వచ్చేశాం. కానీ విమాన ప్రయాణాల సంఖ్య సాధారణ స్థితికి చేరుకోడానికి చాలా సమయం పడుతోంది. అన్ని దేశాలు ఆంక్షలు సడలించడానికే ఏడాది సమయం పట్టింది. ఆ తర్వాత కూడా ప్రయాణాలు జోరందుకోలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. విమానాశ్రయం నుంచి రాకపోకలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగాయి.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొవిడ్ ముందు పరిస్థితులు..

గతేడాది అక్టోబరు- డిసెంబరు మధ్య కాలంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల రద్దీ 11 శాతం పెరిగింది. ఏడాది ముందు ఉన్న పరిస్థితులతో పోల్చి చూస్తే.. 25 శాతం రద్దీ పెరిగినట్టు మొత్తం ప్రయాణికుల సంఖ్య 54 లక్షలకు చేరుకున్నట్టు జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (GAIL) వెల్లడించింది. హైదరాబాద్‌ నుంచి ప్రస్తుతం 64 దేశీయ నగరాలకు, 17 అంతర్జాతీయ నగరాలకు విమానాలు రాకపోకలు సాగుతున్నట్టు పేర్కొంది.

ఢిల్లీలోనూ భారీ రద్దీ..

జీఎంఆర్ సంస్థ నిర్వహణలోనే ఉన్న ఢిల్లీ విమానాశ్రయంలోనూ ఇదే విధంగా రద్దీ, ప్రయాణికుల రాకపోకలు బాగా పెరిగాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సంఖ్య 26 శాతం వృద్ధితో 1.70 కోట్లకు చేరుకున్నట్లు జీఎంఆర్‌ సంస్థ వివరించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి మనదేశంలోని 79 నగరాలకు, 62 అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల నుంచి ప్రయాణికుల ఆదాయంతోపాటు, నాన్‌- ఏరో రెవిన్యూ కూడా బాగా పెరిగినట్లు పేర్కొంది.

మెరుగైన ఫలితాలు..

దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడంతో ఎయిర్ పోర్ట్ లతోపాటు, విమానయాన సంస్థలకు కూడా ఆదాయాలు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కొవిడ్ ముందు పరిస్థితులను మించి రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని ఇతర దేశాలు కూడా ఆంక్షలు పూర్తి స్థాయిలో సడలిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News