రేవంత్‌కు అటెన్షన్ డెఫిషియెన్సీ సిండ్రోమ్
ఇలాంటి అవగాహన లేని సీఎం దేశంలో ఇంకొకరు లేరు : శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి
సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నాడని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ పనితీరుతోనే ఐటీ రంగంలో తెలంగాణ పురోగమించిందని.. అసహనంతో సీఎం మాజీ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సింగపూర్‌ను రాష్ట్రం అని.. అమెజాన్ వెబ్ సిరీస్ అని.. టీబీని లెప్రసీ అని ఏదేదో మాట్లాడుతున్నారని, ఇంతటి అవగాహన లేని సీఎం దేశంలో ఇంకొకరు లేరన్నారు. అనుభవ రాహిత్యంలో రేవంత్‌కు ఆయనే సాటి అన్నారు. ప్రజలను ఊహల పల్లకీలో ఊరేగిస్తున్నాడని.. ఆయనవి ఉత్తర కుమార ప్రగల్బాలు అన్నారు. కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తే రేవంత్ రాష్ట్రంలో అస్థిరత తెచ్చారన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని చెప్పారు. కేసీఆర్ కట్టిన అద్భుతమైన సెక్రటేరియట్‌ను కాదని.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్షలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్, మాఫియా పాలన కోసమే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తున్నారా అని ప్రశ్నించారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతిచెందడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు.
మేఘాను ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సంస్థతో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశ్నించారు. అనంతగిరి అడవులను మేఘాకు రూ.వెయ్యి కోట్లకు దారాదత్తం చేశారని చెప్పారు. కాంట్రాక్టులు చేసే మేఘాతో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు ఎలా ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అనంతగిరి అడవులను మేఘాకు అప్పగించడంపై వెనక్కి తగ్గకుండా ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. వికారాబాద్ రోడ్లను బాగు చేయలేని సీఎం రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరుగుతున్నాయని.. బేస్మెంట్ వరకు నిర్మిస్తేనే డబ్బులు ఇస్తామంటున్నారని.. ఎస్సీ, ఎస్టీల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయో చెప్పాలన్నారు. ఉపాధి హామీ పనులతో సంబంధం లేకుండా వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా కింద సాయం చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.