ఎకరానికి రూ.5 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తాం

ఆందోళన బాట పట్టిన మామునూరు ఎయిర్‌పోర్టు భూనిర్వాసితులు;

Advertisement
Update:2025-03-04 13:29 IST

వరంగల్‌ జిల్లాలో మామునూరు ఎయిర్‌పోర్టు భూనిర్వాసితులు మంగళవారం ఆందోళనకు దిగారు. నక్కలపల్లి, గుంటురుపల్లి, నల్లకుంట, గాడిపెల్లి గ్రామస్థులు నిరసన చేపట్టారు. సర్వే నిలిపివేసి వెళ్లిపోవాలని ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గం కావాలని, రైతులకు మార్కెట్‌ ధరకు తగినట్లుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తెలిపారు. అప్పుడే సర్వే చేయడానికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. జై జవాన్‌..జై కిసాన్‌ అని సుమారు 200 మంది రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎకరానికి రూ.5 కోట్లు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు అంటున్నారు. మంత్రి కొండా సురేఖది ఒక మాట.. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట అని మండిపడుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటున్నారు.. రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నారు. వీళ్లిద్దరే సరిగ్గా లేరు.. వీళ్లు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇప్పటివరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ఎకరానికి రూ.5 కోట్లు, మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను భూమి యజమానులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. ధర్నాకు అనుమతి లేదని.. ఆందోళన విరమించాల్సిందిగా రైతులకు సూచించారు. అయినప్పటికీ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News