కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం
ఇంకా కొనసాగుతున్న పట్టభద్రుల పోలింగ్‌లో బ్యాలెట్ పత్రాలు సరిపోల్చే ప్రక్రియ;
ఉమ్మడి నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం సుమారు 2.5 లక్షల ఓట్లు పోలయ్యాయి. 2,10,000 ఓట్లను విభజించిన సిబ్బంది.. 21 వేల ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మరో 40 వేల ఓట్ల విభజన చేపట్టనున్నారు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనుండటంతో కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. పట్టభద్రుల పోలింగ్‌లో బ్యాలెట్ పత్రాలు సరిపోల్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. మొత్తం 499 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఉండగా.. సోమవారం అర్ధరాత్రి వరకు దాదాపు 250 పోలింగ్ కేంద్రాలకు చెందిన డబ్బాలను మాత్రమే తెరిచారు. మొత్తం 2.5 లక్షల పోలైన ఓట్లలో ఇప్పటివరకు దాదాపు లక్ష వరకు సరిచూస్తే అందులో 8 వేల వరకు చెల్లనివే వచ్చాయి. దీంతో మిగిలిన అన్ని బ్యాలెట్ పత్రాల పరిశీలన పూర్తయ్యే సరికి మరో 10 వేల వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నదని అభ్యర్థులే భావిస్తున్నారు. చాలామంది ఓట్లరు 1 అంకెను సరిగ్గా వేయలేకపోయారు. కొన్ని బ్యాలెట్లలో 1 అంకెను ఇద్దరు ముగ్గిరికి వేయడం, టిక్ కొట్టడం, ఓకే అని రాయడం, అభ్యర్థి ఫొటో పక్కన మార్క్ చేయడం వంటి తప్పిదాలతో చెల్లుబాటు కాలేదు. ఎన్నికల సిబ్బంది ఇచ్చిన ఊదారంగు స్కెచ్ పెన్నుకాకుండా ఓటర్లు తాము తెచ్చుకున్న పెన్నుతో ప్రాధాన్యం ఇవ్వగా అలాంటి ఓట్లు కూడా చెల్లలేదు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో విజేత తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు.