రజాకార్ల తరహాలో రేవంత్‌ పాలన

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకురాలు తుల ఉమ

Advertisement
Update:2024-11-16 19:57 IST

రజాకార్ల తరహాలో తెలంగాణలో రేవంత్‌ రెడ్డి పాలన సాగుతోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకురాలు తుల ఉమ అన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ తో కలిసి శనివారం ఆమె తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడారు. గిరిజనులు, ప్రజలపై దాడులు జరుగుతుంటే రాహుల్‌ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. లగచర్ల గిరిజనులు, రైతులకు భూములే ఆధారమని వాళ్లను బెదిరించి ఆ భూములు గుంజుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. కలెక్టర్‌ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఊరు అవతల మీటింగ్‌ పెట్టారని, ప్రజలు కలెక్టర్‌, అధికారులను ప్రశ్నించడమే తప్పా అని నిలదీశారు. తనపై దాడి జరగలేదని కలెక్టరే చెప్పారని, అయినా ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రజలు వేధిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలతో బీఆర్‌ఎస్‌ ది పేగుబంధమని, ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా వారి తరపున స్పందిస్తామన్నారు. 11 నెలల పాలనలో రేవంత్‌ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనలేదన్నారు. కేసులు, అరెస్టులకు భయపడే వాళ్లేవరూ లేరని, ఇది ఉద్యమ పార్టీ అన్నారు. అర్ధరాత్రి కరెంట్‌ తీసేసి పోలీసులు ఇండ్ల మీద దాడులు చేశారని, ఆడవాళ్లను బెదిరించారని, దాడి చేశారని తెలిపారు. వారందరికీ తాము అండగా ఉంటామన్నారు. పోలీసులు తమను ఎలా వేధించారో చెప్పుకుని మహిళలు రోదించారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌ అన్నారు. సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News