రూ.50 కోట్లు పెట్టి పదవి కొన్న రేవంత్ రెడ్డి.. అవినీతి అంటూ మాట్లాడటం విడ్డూరం : వై. సతీశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న స్కాములన్నీ చేసిందని.. కాంగ్రెస్ పార్టీ పేరును స్కామ్ గ్రెస్‌గా మార్చుకున్న ఘనత వారిదని సతీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2023-06-09 21:27 IST

రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. లీడర్ల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు సొంత పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అవినీతి అంటూ మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినంత విడ్డూరంగా ఉందని రెడ్కో చైర్మన్ వై. సతీశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. తమను తాము ఎక్కువగా ఊహించుకొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారని సతీశ్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న స్కాములన్నీ చేసిందని.. కాంగ్రెస్ పార్టీ పేరును స్కామ్ గ్రెస్‌గా మార్చుకున్న ఘనత వారిదని సతీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం వారి ప్రభుత్వ పాలనలోనే కాకుండా సొంత పార్టీలో కూడా అవినీతికి తెరలేపి.. అడ్డగోలు దోపిడీ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. పార్టీనే అడ్డగోలుగా దోచుకుంటున్న మీకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. ఏ స్థాయిలో దోచుకుంటారో ప్రజలకు తెలుసు కాబట్టే.. మిమ్మల్ని దూరం పెట్టారని సతీశ్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అది చేశాం.. ఇది చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాంటప్పుడు రైతు బీమా, రైతు బంధు ఎందుకు తీసుకొని రాలేకపోయారని సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే కదా.. అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో సాగు విస్తీర్ణం ఎంత? వరి ధాన్యం దిగుబడి ఎంత? తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఇప్పుడు రాష్ట్రంలో ఎంత మేరకు సాగు అవుతోందో తెలుసుకోవాలని సూచించారు.

ప్రజల మీద కాంగ్రెస్‌కు నిజమైన ప్రేమ ఉంటే.. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు ఎందుకు తీసుకొనిరాలేకపోయారో చెప్పాలని కోరారు. అప్పట్లో మీరు చేసిన అభివృద్ధికి ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ విషయంపై చర్చకు రావాలని సతీశ్ రెడ్డి సవాలు విసిరారు.

తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించకుండా.. తాము అధికారంలోకి వస్తే ధరణి వ్యవస్థను ఎత్తేస్తామని చెబుతున్నారు. అంటే ధరణిని ఎత్తేసి.. దళారీ వ్యవస్థను మళ్లీ తీసుకొని వస్తారా అంటూ సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఇది రేవంత్ రెడ్డి తెలివితక్కువ తనానికి నిదర్శనమని ఆరోపించారు. దళారీ వ్యవస్థకు ప్రాణం పోసి, సమస్యలు సృష్టించి.. రాజకీయ పబ్బం గడుపుకోవాలని రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని సతీశ్ రెడ్డి మండిపడ్డారు.

ధరణి వద్దు అంటున్నారంటే.. రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలను అందకుండా చేద్దామని చూస్తున్నట్లే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో లేకపోతేనే ఇన్ని కుట్రలు చేస్తుంటే.. ఇక మీ చేతికి అధికారం ఇస్తే ఇంకెన్ని దారుణాలో చేస్తారో అని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ధరణి వద్దు అనే మాట కొత్తగా పాస్ పుస్తకాలు అందుకున్న రైతులతో చెప్పించండి. అలాగే నువ్వు, మీ పార్టీ నాయకులు రైతు బంధు, రైతు బీమా వద్దని రాసివ్వండని సవాలు విసిరారు.

ధరణిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే రేవంత్ రెడ్డి వాటిని బయటపెడ్డాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు, రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాయాలని.. లేకపోతే చూస్తూ ఊరుకోబోమని సతీశ్ రెడ్డి అన్నారు.

Tags:    
Advertisement

Similar News