'గుంపు మేస్త్రీ'.. సీఎం రేవంత్ అంతగా హర్ట్ అయ్యారా..?

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని, ఇప్పుడు అసలు ఆట మొదలవుతుందన్నారు. ఇంద్రవెల్లి వేదిక నుంచి అసలు సినిమా మొదలవుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-01-26 07:43 IST

సీఎం పదవి గుంపు మేస్త్రీ లాంటిదంటూ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆయన సీిఎం అయ్యాక ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా బాగా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అనుకూల హ్యాండిళ్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మీమ్స్ చేసి వైరల్ చేశాయి. సినిమాలో సూటూ బూటు వేసుకున్న కమెడియన్ సీరియస్ గా వచ్చి తాపీ పని చేసి వెళ్లిపోయే సీన్ ను కట్ చేసి రేవంత్ కి జతచేసి కామెంట్లు చేశారు నెటిజన్లు. అయితే ఇలాంటి మీమ్స్ అన్నీ రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తాయా..? అనుకోవడం పొరపాటే. సీఎం రేవంత్ తాజా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. సోషల్ మీడియా కామెంట్లను ఆయన సీరియస్ గా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన 'గుంపు మేస్త్రీ' కామెంట్లపై రియాక్ట్ అయ్యారు.



తనను అందరూ మేస్త్రీ అంటూ విమర్శిస్తున్నారని కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల మీటింగ్ లో గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. "అవును నేను మేస్త్రీనే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసే మేస్త్రీని. తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని. తెలంగాణ నిరుద్యోగుల జీవితాలు తీర్చిదిద్దే మేస్త్రీని. మీ పార్టీకి గోరీకట్టే మేస్త్రీని కూడా నేనే." అని రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. వచ్చే పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకం అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని, ఇప్పుడు అసలు ఆట మొదలవుతుందన్నారు. ఇంద్రవెల్లి వేదిక నుంచి అసలు సినిమా మొదలవుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. మోదీని ఓడిద్దాం - రాహుల్‌ను ప్రధానిని చేద్దామంటూ నినదించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మారిస్తే గెలిచేవాళ్లమంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. అదంతా వారి అపోహ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో మైనార్టీలు ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు వేసే ఓటు మూసీలో వేసినట్లు అవుతుందన్నారు. అక్కడ మోదీకైనా, ఇక్కడ బీఆర్ఎస్ కైనా.. గుణపాఠం చెప్పేది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు రేవంత్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News