రేవంత్ ప్రపంచ బ్యాంకుకు తెలంగాణను తాకట్టు పెడుతున్నరు
అసెంబ్లీలో డీపీఆర్ లేదని చెప్పి.. వరల్డ్ బ్యాంకుకు ఉందని చెప్పారు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను, హైదరాబాద్ ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి బుధవారం శాసన మండలి మీడియా పాయింట్లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి సంచలన పత్రాలను బయటపెట్టారు. ప్రభుత్వం దాచిపెడుతున్న కీలక విషయాలను ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు పంపిన ప్రతిపాదనల్లో ఉన్న విషయాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇంకా సిద్ధం కాలేదని మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో చెప్పారని.. కానీ ప్రపంచ బ్యాంక్ కు పంపిన ప్రతిపాదనల్లో డీపీఆర్ ఉందని చెప్పారని ఆ వివరాలను బహిర్గతం చేశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పుడు సమాధానాలు చెబుతోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతున్నారని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, అందులో స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాశారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు మరుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణం కోరామని తప్పుడు విషయం చెప్పారన్నారు. రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద పెద్ద భవంతులు కడుతామని ప్రతిపాదనల్లో స్పష్టంగా ఉందని వెల్లడించారు. డీపీఆర్ తయారు కాలేదని డిసెంబరు 17న ప్రభుత్వం చెప్పిందని, కానీ డీపీఆర్ ఉందని ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబరు 19న తెలియజేసిందన్నారు. ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపిన తర్వాత అక్టోబరులో డీపీఆర్ తయారీకి కాన్షార్షియంను ప్రభుత్వం నియమించిందన్నారు.
ప్రభుత్వం ఎందుకు అబద్ధాలు చెప్తోందని నిలదీశారు. ఎవరి కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ప్రభుత్వాన్ని కవిత నిలదీశారు. పారదర్శకత లేకుండా ఎందుకు దాపరికంతో వ్యవహిరిస్తున్నారని అడిగారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చే విషయంలోనూ ప్రభుత్వం రహస్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, అసెంబ్లీకి, పేద ప్రజలకు వేర్వేరు మాటలు చెబుతోందని విమర్శించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో భయానక పరిస్థితి నెలకొందని, 15 వేల ఇళ్లకు మార్కింగ్ చేయడం వల్ల తమ ఇళ్లను ఎప్పుడు కూల్చుతారో అన్న భయం వారిలో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ కల్పిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేయబోయే రియల్ ఎస్టేట్ లో నిర్వాసితులకు ఏం వస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను వెల్లడించాలని డిమాండ్ చేశారు.