రేవంత్‌.. హైదరాబాద్‌ లో పాదాల మీద యాత్ర చెయ్యి

బాధితులు ఇక్కడ ఉంటే నల్గొండ రైతులను కలవడం ఏంటి? : కేటీఆర్‌

Advertisement
Update:2024-11-08 13:29 IST

హైదరాబాద్‌ లో మూసీ బాధితులు ఉంటే సీఎం రేవంత్‌ రెడ్డి నల్గొండలో మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో ఆతంర్యం ఏమిటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా ప్రశ్నించారు. మోకాలికి దెబ్బతగిలితే బోడిగుండుకు కుట్లు వేసినట్టుగా గుంపుమేస్త్రీ పాలన తీరు ఉందన్నారు. ''కూల్చిన ఇండ్లెక్కడ - కాలిన కడుపులెక్కడ -నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ.. ఆగిన గుండెలెక్కడ - రగిలిన మనసులెక్కడ .. నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ - నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ.. నీ కుట్రలకు అంబర్ పేట్ - అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే - నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ.. నీ మూసి దాహానికి అత్తాపూర్ ఆగమైంది -గోల్నాక గొల్లుమంటుంది-దిలుషుక్ నగర్ ఢీలా పడ్డది.. అయ్యా సంబరాల రాం బాబు - నీ అన్యాయానికి.. అవేధనలు, ఆవేశాలు, అక్రాందనాలు వినిపిస్తున్నవి కనిపిస్తున్నవి అక్కడ కాదు రా ఇటు వైపు రా ఇక్కడ చెయ్యి నీ పాదాల మీద యాత్ర.. తేలు మంత్రం రానోడు .. పాము కాటుకు మంత్రం ఏసినట్లు .. పాలన తెల్వని నీకు పగ్గాలు అప్పగిస్తే ప్రజల బతుకుల్ల మన్ను పోసినవ్ .. నాయకత్వం అంటే కూల్చడం కాదు .. నిర్మించడం.. నాయకత్వం అంటే తొవ్వ తప్పడం కాదు .. తొవ్వ చూపడం'' అని పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులు, నిర్బంధాలేనా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ ప్రాంత పర్యటనను అడ్డుకుంటారని మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి, నాయకులను ముందస్తు అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు.

Tags:    
Advertisement

Similar News