టీఆర్ఎస్ వద్దంటేనే రాజగోపాల్ బీజేపీలో చేరారు..

కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తానంటూ బతిమిలాడుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-08-14 08:39 IST

"కాంట్రాక్ట్ లు ఇస్తే టీఆర్ఎస్ లోకి వస్తా.." ఇదీ మా పార్టీతో రాజగోపాల్ రెడ్డి చేసిన బేరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. 21వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ లు కేంద్రం నుంచి తెచ్చుకున్న తర్వాతే ఆయన కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారని విమర్శించారు. టీఆర్ఎస్‌తో బేరం కుదరకే ఆయన బీజేపీలో చేరారని అన్నారు. గతంలో టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం వచ్చారని, కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంట్రాక్ట్ ల కోసం రావాలనుకున్నారని చెప్పారు. అది కుదరకపోవడంతో బీజేపీ పంచన చేరారని దుయ్యబట్టారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంట్రాక్టులు ఇస్తే టీఆర్‌ఎస్‌లోకి వస్తానంటూ బతిమిలాడుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి దొంగ, ప్రజా ద్రోహి, స్వార్థం కోసమే రాజకీయాలు చేసే వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు జగదీష్ రెడ్డి. దొంగలు, ద్రోహులు, కాంట్రాక్టర్లకు.. మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక ఇదని మంత్రి పేర్కొన్నారు.

మూడో స్థానం ఖాయం..

సిట్టింగ్ ఎమ్మెల్యేగా మునుగోడు బరిలో దిగుతున్న రాజగోపాల్ రెడ్డికి రెండో స్థానం కూడా రాదని, ఆయనకు మూడో స్థానమే ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. పేదలకు సంక్షేమ పథకాలు వద్దంటున్న బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరారని, అంటే ఆయన కూడా సంక్షేమ పథకాలకు వ్యతిరేకమేనని అన్నారు. దేశ ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న మోదీ వ్యవహారాలన్నిటినీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వివరిస్తారని అన్నారు జగదీష్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ సభకు తరలిరావడానికి సిద్ధం అవుతున్నారని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ సభతో ఇక్కడి ఫలితంపై విపక్షాలకు పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News