కాంగ్రెస్ కండువా కప్పి పొంగులేటి, ఇతరులను పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ
సీఎల్పీ నాయకుడు గత 106 రోజులుగా చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా పూర్తి చేసుకొని వేదిక వద్దకు చేరుకున్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న 'తెలంగాణ జన గర్జన' సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతరులకు కండువా కప్పి రాహుల్ గాంధీ పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న ఈ సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యాయి. సీఎల్పీ నాయకుడు గత 106 రోజులుగా చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కూడా పూర్తి చేసుకొని వేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా భట్టిని అభినందించి, ఆయనతో కలిసి రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేశారు.
అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు అరికెల నర్సిరెడ్డి, పిడమర్తి రవి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు వేదిక వద్దకు వచ్చిన రాహుల్ గాంధీకి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇక ప్రజా యుద్దనౌక గద్దర్ కూడా అక్కడకు చేరుకున్నారు. రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని ఆయన రెండు బుగ్గలకు గద్దర్ ముద్దు పెట్టడం విశేషం.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగించుకున్న భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించారు. ఎండనకా, వాననకా వంద రోజులకు పైగా పాదయాత్ర చేసినందుకు ఆయనను అభినందించారు.