పంచాయితీలతో అందరికీ నష్టం.. టీకాంగ్ నేతలకు ప్రియాంక ఉపదేశం..

సెప్టెంబర్ మొదటి వారంలో మునుగోడులో కాంగ్రెస్ భారీ సభకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ రాబోతున్నారు. దాదాపుగా ఆలోపు అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2022-08-23 09:57 IST

తెలంగాణపై ప్రియాంక్ గాంధీ ఫోకస్ పెడుతున్నారనే వార్తలకు బలం చేకూరింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని పిలిపించుకుని మాట్లాడిన ప్రియాంక వారికి ధైర్యం చెప్పి పంపించారు. ఇకపై తెలంగాణ కాంగ్రెస్ కి పూర్తి సమయం ఇస్తానని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఇబ్బందులు, సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావొచ్చని భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే మీకే మంచిది, పంచాయితీలు పెట్టుకుంటే మీరు, మేము అందరం నష్టపోతామని హితబోధ చేశారు.

మునుగోడు అభ్యర్థిపై కసరత్తు..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్ చార్జ్​ మాణిక్యం ఠాగూర్‌‌, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు ప్రియాంకతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వారికి సూచించారు ప్రియాంక. అభ్యర్థి ఎంపిక పై ఏఐసీసీ కార్యదర్శులు కసరత్తు మొదలు పెట్టాలన్నారు. జిల్లా నాయకుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో మునుగోడులో కాంగ్రెస్ భారీ సభకు సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ రాబోతున్నారు. దాదాపుగా ఆలోపు అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

వెంకట్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర నేతలకే..

రాష్ట్ర నేతలపై ఫిర్యాదు చేసేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, అయితే ఆయన వ్యవహారాన్ని తిరిగి రాష్ట్ర నేతలకే అప్పగించారు ప్రియాంక గాంధీ. ఆమె సూచన మేరకు.. వెంకట్ రెడ్డితో మాట్లాడే బాధ్యతను దామోదర రాజనర్సింహ, మధు యాష్కీ లకు అప్పగించారు కేసీ వేణుగోపాల్. మొత్తమ్మీద మునుగోడు సీటుని కాపాడుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రియాంక సారథ్యంలో ఉప ఎన్నికను ఎదుర్కోబోతోంది. ప్రియాంక వ్యూహరచన, ఆమె రాజకీయ చతురత, శక్తి సామర్థ్యాలేంటో ఈ ఉప ఎన్నికతో తేలిపోబోతున్నాయి. అదే సమయంలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటనేది కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం బయటపెడుతుంది.

Tags:    
Advertisement

Similar News