ప్రజాదర్బార్ పేరు మార్పు.. రేవంత్ ముద్ర సుస్పష్టం
ఇప్పటి వరకు వచ్చిన అర్జీలలో ఎక్కువశాతం ధరణి కారణంగా తలెత్తిన భూవివాదాలేనని తెలిపారు అధికారులు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వివిధ రకాల పింఛన్లకోసం వచ్చిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయని చెప్పారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజా భవన్ కు వచ్చేవారికి తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా అమలు చేస్తున్న ప్రజా దర్బార్ పేరు మారింది. ఇకనుంచి ఆ కార్యక్రమాన్ని ప్రజావాణి పేరుతో పిలుస్తారు. ఇకపై వారంలో రెండు రోజులు ప్రజావాణి నిర్వహిస్తారు. ఈనెల 8న ప్రజా దర్బార్ మొదలు కాగా.. మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో అర్జీలు స్వీకరించడం మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు స్వయంగా కొంతమంది బాధితుల దగ్గర అర్జీలు స్వీకరించారు. అదికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. సోమవారం వరకు 4,471 అర్జీలు స్వీకరించినట్టు అధికారులు తెలిపారు.
వారంలో రెండు రోజులు..
ఇకనుంచి వారంలో రెండు రోజులు ప్రజావాణి నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి జరుగుతుంది. ఉదయం 10 లోపు ప్రజాభవన్ కు చేరుకున్న వారిని లోపలికి పంపిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట లోగా వారు వినతిపత్రాలు అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు ప్రజా భవన్ నుంచి బయటకు వస్తారు.
ధరణి సమస్యలపై ఎక్కువ అర్జీలు..
ఇప్పటి వరకు వచ్చిన అర్జీలలో ఎక్కువశాతం ధరణి కారణంగా తలెత్తిన భూవివాదాలేనని తెలిపారు అధికారులు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వివిధ రకాల పింఛన్లకోసం వచ్చిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఇకపై ప్రజావాణి మరింత పగడ్బందీగా ఏర్పాటు చేయబోతున్నారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ-లైన్లు ఏర్పాటుచేయాలని, ప్రజా భవన్ కు వచ్చేవారికి తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.