ఓటర్లే టార్గెట్‌గా పోస్టర్లు.. 'బతికున్న శవం'లా మారతారా అంటూ సూటి ప్రశ్న!

ఓటర్లలో చైతన్యం తీసుకొని రావడానికి కొంత మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను డబ్బు, మద్యానికి అమ్ముకోవద్దని పోస్టర్ల ద్వారా వేడుకుంటున్నారు.

Advertisement
Update:2022-10-21 09:52 IST

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం అభ్యర్థులు, పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లిపోతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు అభివృద్ధి విషయంలో వారికి అనుకూలమైన ప్రచారం చేసుకుంటున్నారు. ఉపఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి, బీజేపీని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయి. రూ. 18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఉపఎన్నిక వచ్చిందనే విషయాన్ని ప్రజలకు టీఆర్ఎస్ బాగానే చేరవేసింది. కేవలం మాటలతోనే కాకుండా పోస్టర్లతో కూడా మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ టార్గెట్‌గా వేసిన పోస్టర్లు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి.

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల విషయంతో పాటు బీజేపీ అసమర్థ పాలనపై కూడా పోస్టర్లు వెలిశాయి. తెలంగాణలో ఆసరా పెన్షన్ రూ. 2,016 వస్తుండగా యూపీ, గుజరాత్‌లో కేవలం రూ. 1000 ఇస్తున్నారని ముద్రించిన పోస్టర్లు నియోజకవర్గం అంతా అంటించారు. అలాగే దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలం మోసపోయాం.. మీరు కూడా బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దంటూ వేసిన పోస్టర్ హైలైట్‌గా నిలిచింది. నిత్యం ఏదో ఒక పోస్టర్ మునుగోడు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అయితే తాజగా వేసిన ఒక పోస్టర్ మాత్రం ఓటర్లను సూటిగా ప్రశ్నించేలా ఉన్నది.

ఓటర్లలో చైతన్యం తీసుకొని రావడానికి కొంత మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను డబ్బు, మద్యానికి అమ్ముకోవద్దని పోస్టర్ల ద్వారా వేడుకుంటున్నారు. ఇలాంటి ప్రలోభాలకు లొంగి భవిష్యత్‌ను అమ్ముకుంటే 'బతికున్న శవం'తో సమానం అని సూటిగా చెప్పేస్తున్నారు. మునుగోడులో పెద్ద ఎత్తున ఈ పోస్టర్లను కొంత మంది యువత గోడలకు అతికిస్తున్నారు.

మీరు ఓటు వేయాలని అనుకుంటే సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం, అభ్యదయం గురించి మాట్లాడే వారిని ఎంచుకోండి. వారికి తగిన అర్హత, నిబద్దత ఉన్నదో లేదో చూసి ఓటు వేయాలని పోస్టర్లలో రాశారు. ఇలా ఎన్నుకుంటే దేశం తలరాత మారుతుందని చెబుతున్నారు. నోటకు ఓటును అమ్ముకునే వ్యక్తి శవంతో సమానం అని పేర్కొన్నారు. మునుగోడు ఓటర్లారా.. ఆలోచించండి.. మీరు ఓటును అమ్ముకుంటారా? భవిష్యత్‌ను నమ్ముకుంటారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఉపఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడులో ప్రలోభాలు ఎక్కువయ్యాయి. నిత్యం విందు, మందులతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. కులాల వారీగా బంతి భోజనాలు.. అవసరం అయితే సిట్టింగులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గత కొన్ని రోజుల నుంచి కూలి పనులకు వెళ్లడానికంటే ఇంటి పట్టున ఉంటేనే ఎక్కుల లబ్ది చేకూరుతుందని కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. రోజంతా ఏదో ఒక కండువా కప్పుకొని సాయంత్రం అయ్యే సరికి ఎంతో కొంత డబ్బు జేబులో వేసుకొని ఇంటికి పోతున్నారు. గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు.

ఇలాంటి మద్యం, డబ్బు ప్రవాహం ఉండొద్దని వేసిన పోస్టర్లు మునుగోడు ఓటర్లలో ఎంత మేరకు చైతన్యం తీసుకొస్తుందో చెప్పడం కష్టమే. 

Tags:    
Advertisement

Similar News