పవన్ కి ఏపీలో నో ఎంట్రీ, బేగంపేటలో బ్రేక్..
ఇటు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద కూడా హడావిడి నెలకొంది. పవన్ కల్యాణ్ ని రిసీవ్ చేసుకోడానికి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాయి. తీరా ఆయన రావడం లేదని తెలిసే సరికి ఆందోళనకు దిగాయి.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత, హైదరాబాద్ లో ఉన్న పవన్ కల్యాణ్ హడావిడిగా ఏపీకి బయలుదేరారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన నాయకులతో మీటింగ్ అని చెబుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయన రాకను అడ్డుకుంది. ఏపీలో శాంతి భద్రతల సమస్య వస్తుందని, అందుకే ఆయన్ను హైదరాబాద్ నుంచి బయలుదేరకుండా అడ్డుకోవాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీ రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ లో అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.
ఈరోజు సాయంత్రం పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని బేగంపేటకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఆయన గన్నవరం రావాల్సి ఉంది. అయితే పోలీసులు అక్కడ విమానం టేకాఫ్ కాకుండా అడ్డుకున్నారు. ఆయన్ను వెనక్కు వెళ్లిపోవాలని సూచించారు. పోలీసులు అడ్డుకోవడంతో పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి వెళ్లడానికి తనకు అనుమతి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
ఇటు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద కూడా హడావిడి నెలకొంది. పవన్ కల్యాణ్ ని రిసీవ్ చేసుకోడానికి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాయి. తీరా ఆయన రావడం లేదని తెలిసే సరికి ఆందోళనకు దిగాయి. సోషల్ మీడియాలో జనసైనికులు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ని జనసేన కూడా ఖండించింది. ఒకరకంగా ఆ విషయంలో హడావిడి చేసేందుకే పవన్ ఏపీకి వస్తున్నారని అంటున్నారు. ఈ దశలో పవన్ ని కూడా రాకుండా అడ్డుకోవడంతో జనసేన మరింత ఆందోళన చేస్తోంది. ఎలాగైనా ఏపీకి రావాలనుకుంటున్న పవన్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటారేమో చూడాలి. అసలీ నిషేధం ఎన్నిరోజుల వరకు ఉంటుందో తేలాల్సి ఉంది.