హైదరాబాద్‌లో పారీస్ మోడల్.. మూసీ నదిపై 15 బ్రిడ్జీల నిర్మాణం

మూసీ, ఈసా నదులకు ఇరు వైపుల ఉన్న ప్రాంతాలను కలపడానికి ఇప్పుడు ఉన్న లింక్ బ్రిడ్జీలకు తోడు మరో 15 కొత్త బ్రిడ్జీల నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
Update:2023-04-22 16:26 IST

హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా ఎదుగుతోంది. నిత్యం నగరంలో రద్దీ పెరిగిపోతుండటంతో.. అందుకు అనుగుణంగా ఫ్లై వోవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. అయితే నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ వల్ల కొన్ని ప్రాంతాల్లో కనెక్టింగ్‌కి ఇబ్బందిగా మారింది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూసీ కూడా మూరికి కూపంలా మారింది. మూసీ విషయాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

ఇక మూసీ, ఈసా నదులకు ఇరు వైపుల ఉన్న ప్రాంతాలను కలపడానికి ఇప్పుడు ఉన్న లింక్ బ్రిడ్జీలకు తోడు మరో 15 కొత్త బ్రిడ్జీల నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పారీస్ నగరంలో నిర్మించిన బ్రిడ్జీల మాదిరిగా.. వీటి నిర్మాణం ఉండనున్నది. కేవలం వాహనాల కోసం మాత్రమే కాకుండా.. నడక వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్), కులీ కుతబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (క్యూక్యూఎస్‌యూడీఏ), హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలు ఈ బ్రిడ్జీల నిర్మాణాన్ని చేపట్టనున్నాయి.

సాధారణ బ్రిడ్జీల మాదిరిగా కాకుండా హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింభించేలా ఈ వంతెల నిర్మాణం జరుగనున్నది. ఈ 15 వంతెనలు హైదరాబాద్ నగరానికి సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే ఈ బ్రిడ్జీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రెజెంటేషన్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు అధికారులు సమర్పించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, సాంస్కృతిక చిహ్నాలుగా ఈ బ్రిడ్జీలు ఉండనున్నాయి.

ఇప్పటికే హెచ్ఆర్డీసీఎల్ రెండు బ్రిడ్జీల నిర్మాణానికి టెండర్లు కూడా ఆహ్వానించింది. మూసీ నదిపై సన్‌సిటీ-చింతల్‌మెట్‌ను కలుపుతూ ఒక హైలెవెల్ బ్రిడ్జీని నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్ల వ్యయం కానున్నది. అలాగే ఇన్నర్ రింగ్‌రోడ్డును, కిస్మత్ పుర రోడ్డుతో కలుపుతూ ఈసా నదిపై మరో బ్రిడ్జి నిర్మాణం కానున్నది. ఈ రెండింటికి టెండర్లు ఆహ్వానించారు. ఇక క్యూక్యూఎస్‌యూడీఏ అఫ్జల్‌గంజ్ వద్ద ఐకానిక్ పెడస్టేరియన్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచింది. రూ.40 కోట్ల వ్యయంతో మూసీ నదిపై దీన్ని నిర్మించనున్నారు. సాలార్‌జంగ్ మ్యూజియానికి సమీపంలో ఈ పెడస్టేరియన్ బ్రిడ్జి నిర్మిస్తారు. గతంలో రూ.231.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వేసినా.. అధికారులు దాన్ని రూ.40 కోట్లకు సవరించారు.

ప్రతిపాదించిన మొత్తం బ్రిడ్జీలు ఇవే..

1. ఐకానిక్ పెడస్టేరియన్ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్ వద్ద - రూ.40.02 కోట్లు

2. ఈసా నదిపై సన్‌సిటీ, చింతల్‌మెట్ కలుపుతూ - రూ.19.10 కోట్లు

3. ఇబ్రహీంబాగ్ కాజ్‌వేకు సమాంతరంగా హైలెవెల్ బ్రిడ్జి - రూ.24.50 కోట్లు

4. నెంబర్ 99 కారిడార్ వద్ద మూసీ నదిపై మిస్సింగ్ లింక్ వద్ద - రూ.30 కోట్లు

5. ఈసా నదిపై బండ్లగూడ జాగీర్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు, కిస్మత్‌పుర రోడ్డు కలుపుతూ - రూ.19.10 కోట్లు

6. మూసారాంబాగ్ వద్ద మూసీ మీద హైలెవెల్ బ్రిడ్జ్ - రూ.30 కోట్లు

7. చాదర్‌ఘాట్ వద్ద మూసీపై హైలెవెల్ బ్రిడ్జి - రూ.30 కోట్లు

8. అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జీలకు సమాంతరంగా మరో హైలెవెల్ బ్రిడ్జి - రూ.46 కోట్లు

9. ఉప్పల్ లేఅవుట్ నుంచి మూసీ దక్షిణ ఒడ్డు వైపు కొత్త బ్రిడ్జీ - రూ.39.10 కోట్లు

10. మంచిరేవుల, నార్సింగిని కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి - రూ.24.50 కోట్లు

11. బద్వేవ్‌ వద్ద ఐటీ పార్కులను, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ ఈసా నదిపై హైలెవెల్ బ్రిడ్జ్ - రూ.11 కోట్లు

12. ప్రతాప్ సింగారం, గౌరెల్లిని కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి - రూ.16 కోట్లు

13. హైదర్‌షా కోట్, రాందేవ్‌గూడను కలుపుతూ కొత్త కనెక్టింగ్ బ్రిడ్జి - రూ.11 కోట్లు

14. బద్వేల్ వద్ద ఐటీ పార్కులను కలుపుతూ ఈసా నదిపై రెండో కనెక్టింగ్ బ్రిడ్జి - రూ.41 కోట్లు

15. మంచిరేవుల వద్ద కొత్త లింక్ రోడ్డును కలుపుతూ బ్రిడ్జి - రూ.11 కోట్లు

Tags:    
Advertisement

Similar News