తెలంగాణలో పేజ్ ఇండస్ట్రీస్ (జాకీ బ్రాండ్‌) 290కోట్ల పెట్టుబడులు..

ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ 290 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో అడుగు పెడుతోంది. 7వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది.

Advertisement
Update:2022-11-16 21:43 IST


ప్రముఖ వస్త్ర తయారీసంస్థ పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 290 కోట్ల రూపాయల పెట్టుబడితో ములుగు, ఇబ్రహీంపట్నంలో ఫెసిలిటీ సెంటర్లు ప్రారంభించబోతోంది. ఈ క్రమంలో పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు స్వాగతం పలికారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్‌ఐఐసీ వీసీ అండ్ ఎండీ నరసింహా రెడ్డి, టెక్స్ టైల్స్ డైరెక్టర్ మిహిర్ పరేఖ్, పేజ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వి.గణేష్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.



భారీగా ఉద్యోగ అవకాశాలు..

ఇబ్రహీం పట్నంలో 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వైట్ గోల్డ్ స్పింటెక్స్ పార్క్ లో పేజ్ ఇండస్ట్రీస్ తమ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా 3వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఇక సిద్ధిపేటలోని ములుగులో 25 ఎకరాల విస్తీర్ణంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 4వేలమంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. మొత్తంగా 7వేల మందికి ఈ పేజ్ ఇండస్ట్రీస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి.

ప్రముఖ లోదుస్తుల తయారీ సంస్థ 'జాకీ' బ్రాండ్ తో భారత్ లో పేజ్ ఇండస్ట్రీస్ వస్త్రాలను తయారు చేస్తుంది. భారత్ తో పాటు, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఒమన్, ఖతర్ లో కూడా జాకీ బ్రాండ్ ఉత్పత్తులను పేజ్ ఇండస్ట్రీస్ తయారీ, మార్కెటింగ్ చేస్తుంది. స్పీడో బ్రాండ్ దుస్తుల తయారీ, పంపిణీకి కూడా భారత్ లో పేజ్ ఇండస్ట్రీస్ కి లైసెన్స్ ఉంది. ఈ రెండు బ్రాండ్ల దుస్తులను భారత్ లో పేజ్ ఇండస్ట్రీస్ తయారు చేస్తుంది. తెలంగాణలో 290 కోట్ల రూపాయలతో ఏర్పాట చేయబోతున్న రెండు ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్పోర్ట్స్ వేర్ (క్రీడలకోసం దుస్తులు), అథ్లీజర్ వేర్ (వ్యాయామ దుస్తులు) తయారు చేస్తారు.


తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవలే హట్సన్ కంపెనీ భారత్ లోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాన్నికూడా ప్రారంభించింది. తాజాగా ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడితో తెలంగాణలో అడుగు పెడుతోంది. వివిధ రకాల కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు తెలంగాణ వైపే చూస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News