మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు.. ప్రపంచ దేశాలతో : ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్

ప్రస్తుతం ఎలాంటి కంపెనీ, పరిశ్రమ స్థాపించాలన్నా తెలంగాణ రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Update:2023-07-03 22:39 IST

తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలోనే సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంతో దూసుకొని పోనున్నది. మన పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని.. ప్రపంచ దేశాలతో మాత్రమే అని మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ అభివృద్ధి ఒక దిక్సూచిలా మారిందని.. మనల్ని చూసి ఆయా రాష్ట్రాలు ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే ఆసక్తిని తీసుకొని వచ్చామని చెప్పారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో సోమవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ 2022 అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..

గతంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రాంతంలో ఏదో ఒక రంగాన్ని మాత్రమే అభివృద్ధి చేశారు. ఒకరు పట్టణ, ఐటీ, అభివృద్ధి చూస్తే.. మరొకరు పల్లె, వ్యవసాయం చూస్తూ.. మిగిలిన రంగాలను వదిలేశారు. సీఎం కేసీఆర్ మాత్రం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకవైపు ఐటీ, ఫార్మా, మౌళిక వసతులను అభివృద్ధి చేస్తూనే.. మరోవైపు వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వాటిపై శ్రద్ద పెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు.

ప్రపంచానికి అవసరం అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం తెలంగాణలోనే తయారు అవుతున్నాయి. వరల్డ్ క్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు తెలంగాణలో ఉన్నాయి. ఇంత అభివృద్ధి జరిగినా.. ఇప్పటికీ మనం ఇతర దేశాల వస్తువులనే వాడుతున్నాము. మన దేశంలో, రాష్ట్రంలో తయారు అవుతున్న వస్తువులను ఎందుకు వాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

రెండో ప్రపంచ యుద్దంలో ఎంతో నష్టపోయిన జపాన్.. 40 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి చెందింది. అందుకు కారణం అక్కడి ప్రజల స్మార్ట్ థింకింగ్ అని మంత్రి చెప్పారు. మనం కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కాకుండా.. ప్రపంచ దేశాలతో పోటీ పడాలని పేక్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తామంటే తప్పకుండా స్వాగతం పలుకుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి కంపెనీ, పరిశ్రమ స్థాపించాలన్నా తెలంగాణ రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ వల్ల పరిశ్రమలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు వస్తున్నాయని చెప్పారు. కేవలం 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని.. అన్ని అర్హతలు ఉండి.. నిర్ణీత సమయంలోగా అనుమతులు రాకపోతే పరిశ్రమలు, యూనిట్లు ప్రారంభించుకునే అవకాశం ఉందన్నారు. అనుమతులు ఇవ్వని అధికారులకు రోజుకు రూ.1000 ఫైన్ వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్లే తెలంగాణ.. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరుకుందని చెప్పారు. 

ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, గ్రీన్‌కో ఇండియా సీఈవో అనిల్ కుమార్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News