బిగ్ మండే.. బీఆర్ఎస్‌కే కాదు తెలంగాణకు కూడా!
కేసీఆర్ తొలి జాబితా సోమవారమే ప్రకటిస్తారన్న బలమైన ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ అధికారికంగా ఎక్కడా దీన్ని నిర్ధారించలేదు.
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠ. ఈ సోమవారానికి తెలంగాణ రాజకీయాల్లో ఎంతో ప్రాముఖ్యత. వరుసగా మూడోసారి విజయం సాధించి స్వరాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ తన అభ్యర్థుల తొలి జాబితా ఈరోజే ప్రకటిస్తుందన్న విషయమే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
విపక్షాలకూ కీలకమే
కేసీఆర్ తొలి జాబితా సోమవారమే ప్రకటిస్తారన్న బలమైన ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ అధికారికంగా ఎక్కడా దీన్ని నిర్ధారించలేదు. గత ఎన్నికల్లోనూ ఇలా రెండు నెలల ముందే ఒకేసారి దాదాపు 90 శాతం టికెట్లు ప్రకటించి, ప్రచారంలో అందరి కంటే ముందు దూసుకుపోయిన కేసీఆర్ ఈసారీ అదే స్ట్రాటజీ ఫాలో అవుతారని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు టికెట్ కోసం బీఆర్ఎస్ ఆశావహులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. విపక్షాలు కూడా అంతే ఉత్కంఠ ఫీలవుతున్నాయి.
టికెట్ దక్కని బీఆర్ఎస్ ఆశావహులను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నాయని సమాచారం. మరోవైపు తమ నియోజకవర్గ టికెట్ ఎవరికి ఇస్తారోనన్న ఉత్సుకత తెలంగాణ ప్రజల్లోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో కూడా మూడు, నాలుగు రోజులుగా ఇవే వార్తలు ఊదరగొడుతుండటంతో జనం అంతా కూడా ఏం జరుగుతుంది, తమ తమ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.