ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని
అధికారం కోల్పోయినప్పుడల్లా బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయిన డిప్యూటీ సీఎం
అధికారం కోల్పోయినప్పుడల్లా బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఏమిటో కేటీఆర్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? రైతు రుణమాఫీ చేయడం వైఫల్యమా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా? అని నిలదీశారు. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని ధ్వజమెత్తారు. కక్ష పూరిత రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ తన పాత్ర పోషించిందా? అని ప్రశ్నించారు. ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి సారించిందని ఆరోపించారు. కులగణన చేస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చామని, దాని ప్రకారమే చేసి చూపిస్తున్నామన్నారు. ఇది విప్లవాత్మ నిర్ణయం.. రాష్ట్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతున్నదన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు.