తెలంగాణ వ్యాప్తంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

గర్భిణీ స్త్రీల పోషకాహార స్థితిని మెరుగు పరచడం, రక్త హీనతను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తోంది.

Advertisement
Update:2023-05-02 18:32 IST

తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. తాజాగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. గర్భిణీ స్త్రీల పోషకాహార స్థితిని మెరుగు పరచడం, రక్త హీనతను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే 9 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద నిరుడు డిసెంబర్ 21న కిట్ల నుంచి పంపిణీ చేస్తున్నారు.

రాష్ట్రంలో రక్తి హీనత కలిగిన గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూలు, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ కిట్లను పంపిణీ చేశారు. మొదటి దశలో కిట్ల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని తేలడంతో.. ఇప్పుడు 33 జిల్లాల్లో కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని విస్తరించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6.84 లక్షల మంది గర్భిణులకు లబ్ది చేకూరనున్నది. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 1,046 కేంద్రాల ద్వారా మొత్తం 13.08 లక్షల కిట్లను పంపిణీ చేయనున్నారు.

న్యూట్రిషన్ కిట్ ఒక్కోటి రూ.2వేల విలువ కలిగి ఉంటుంది. ఈ పథకం కోసం రూ.277 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఒక కిట్‌లో 1 కేజి న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, 1 కేజి ఖర్జూరం పండ్లు, 3 బాటిల్స్ ఐరన్ సిరప్, 500 గ్రాముల నెయ్యి, 200 గ్రాముల వేరు శనగ చిక్కీ, ఒక కప్పు, ఒక ప్లాప్టిక్ బుట్ట ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తున్నందుకు గాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటికే నవజాత శిశువుల కోసం కేసీఆర్ కిట్లు, తల్లులకు పోషకాహార కిట్లు, నాలుగు ఏఎన్‌సీ చెకప్‌లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మాతా శిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ఇవన్నీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా.. గర్భిణీ మహిళల సంరక్షణకు కోసం ఏర్పాటు చేసిన పథకాలు అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

నిమ్స్ కొత్త భవనం శంకుస్థాపనపై మంత్రి హరీశ్ రావు సమీక్ష..

హైదరాబాద్‌లో నిర్మించనున్న 2000 పడకల నిమ్స్ కొత్త భవనం శంకుస్థాపన త్వరలోనే జరుగనున్నది. నగరం చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం నిమ్స్ విస్తరణకు నడుం భిగించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి సచివాలయంలోని తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే భూమి పూజ జరుగనున్నదని, అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాన్ని బట్టి ఇప్పటికే నగరం నలువైపులా వెయ్యి పడకలు ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం చేస్తున్నామని. ఇక నిమ్స్ విస్తరణ కూడా పూర్తియితే సామాన్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని హరీశ్ రావు అన్నారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం, స్టేట్ ఆర్గాన్ ట్రాన్‌ప్లాంట్ సెంటర్ పనులను వేగవంతం చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. ఫెర్టిలిటీ సేవలతో పాటు, అవయవ మార్పిడి సేవలు ఇకపై ప్రభుత్వం కూడా అందిస్తుందని ఆయన తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా.. గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిగితే.. అవసరమైన వారికి అవయవాలు అందించి వారికో కొత్త జీవితాన్ని అందిచేలా చూడాలని మంత్రి సూచించారు.

Tags:    
Advertisement

Similar News