మ‌సాలా పొడులు, ప‌సుపు శాంపిళ్ల‌తో అత్తింటివారిపై విష ప్ర‌యోగం.. - లండ‌న్ నుంచి ప్లాన్‌

మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్ట‌ర్‌ శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం.అజిత్‌కుమార్‌తో వివాహమైంది.

Advertisement
Update:2023-08-20 09:28 IST

భార్య‌పై కోపంతో అత్తింటి కుటుంబాన్ని అంతం చేయాల‌నుకున్నాడో వ్య‌క్తి. అందుకు లండ‌న్ నుంచే ప్లాన్ చేసి హైద‌రాబాద్‌లోని అత్తింటివారిపై అమ‌లు చేశాడు. అత్త మృతిచెంద‌గా, మిగిలిన కుటుంబ‌స‌భ్యులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వ్య‌వ‌హారం పోలీసుల‌కు చేర‌డంతో త‌మ‌దైన శైలిలో విచారించ‌గా అస‌లు కుట్ర బ‌య‌ట‌ప‌డింది. సంచ‌ల‌న‌మైన ఈ కేసు వివ‌రాల‌ను మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ శ‌నివారం వెల్ల‌డించారు.

మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసముండే హన్మంతరావు, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె డాక్ట‌ర్‌ శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం.అజిత్‌కుమార్‌తో వివాహమైంది. ఉద్యోగ రీత్యా ఇద్ద‌రూ లండ‌న్‌లో స్థిర‌ప‌డ్డారు. వారికి ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు నెలకొనడంతో శిరీష లండ‌న్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్ప‌టినుంచి వారిద్ద‌రూ విడిగా ఉంటున్నారు.

లండ‌న్ నుంచే ప‌క్కా ప్లాన్‌తో..

త‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన భార్య‌పై కోపం పెంచుకున్న అజిత్‌కుమార్ ఆమెతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులంద‌రినీ అంత‌మొందించాల‌ని భావించాడు. అందుకు లండ‌న్‌లోనే త‌న వ‌ద్ద ప‌నిచేసే వినోద్‌కుమార్‌ను ఒప్పించాడు. వారిద్ద‌రికీ మిత్రులైన హైద‌రాబాదులో ఉండే భ‌వానీశంక‌ర్‌, అశోక్‌, గోపీనాథ్‌తో పాటు అజిత్ స్నేహితుడు శిరీష బంధువైన పూర్ణేంద్ర‌రావుల‌తో కలిసి కుట్ర ప‌న్నాడు. అదే క్రమంలో సోదరుడి వివాహానికి లండన్ నుంచి శిరీష కుమార్తెతో క‌ల‌సి హైదరాబాద్ వెళ్లడాన్ని అవకాశంగా మలచుకున్నాడు. వాచ్‌మెన్ కుమారుడు రమేష్‌కి కొంత నగదు ముట్టజెప్పి అత్తారింటిపై నిఘా పెట్టాడు.

విష‌పు ఇంజ‌క్ష‌న్ల‌తో హ‌త‌మార్చాల‌ని..

తొలుత అజిత్ అత్తింటివారిని విష‌పు ఇంజ‌క్ష‌న్లు ఇచ్చి హ‌త‌మార్చాల‌ని భావించాడు. అందుకోసం ముగ్గురు వ్య‌క్తులను అత్తింటికి విష‌పు ఇంజ‌క్ష‌న్ల‌తో పంపించాడు. వారు ప్లాన్ ప్ర‌కారం జూన్ 25వ తేదీ తెల్ల‌వారుజామున విష‌పు ఇంజ‌క్ష‌న్ల‌తో శిరీష త‌ల్లిదండ్రుల ఇంటికి వెళ్లినా.. హ‌త్యాయ‌త్నం విఫ‌ల‌మైంది. దీంతో త‌మ ప‌థ‌కాన్ని మార్చి విషం క‌లిపిన మ‌సాలా పొడులు, ప‌సుపు, కారం వంటి వాటిని శాంపిల్ ప్యాకెట్లుగా త‌యారు చేయించాడు. వాటిని డెలివ‌రీ బాయ్ రూపంలో అత్తింటివారికి అంద‌జేశాడు.

ఆరుగురికి అస్వ‌స్థ‌త‌.. అత్త మృత్యువాత‌..

విషం క‌లిపిన శాంపిళ్ల‌ను వినియోగించడంతో అత్తింటిలోను ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే శిరీష తల్లి ఉమామహేశ్వరి జూలై 5న మృతిచెందారు. అందుకు ఆమె అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష, ఆమె తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయి.. కోలుకోకపోవడంతో అనుమానంతో ల్యాబ్‌లో ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు తేలింది. దాంతో శిరీష గురువారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుల‌ను ప‌ట్టించిన సీసీటీవీ ఫుటేజీలు..

మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్‌రావు ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మియాపూర్ సీఐ ప్రేమ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీల్లో వాచ్‌మెన్ కుమారుడు ర‌మేష్ తీరు అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. త‌మ‌దైన శైలిలో విచారించ‌గా, అత‌ను అపార్ట్‌మెంట్‌లో శిరీష ఫ్లాట్‌పైనే ఉండే పూర్ణేంద్ర‌రావు పేరు వెల్ల‌డించాడు. అత‌న్ని విచారించ‌గా, మొత్తం కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైంది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురు నిందితుల‌నూ శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజితకుమార్‌ను త్వ‌ర‌లో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News