మోడీ ప్రభుత్వం కాదు, ఏడీ ప్రభుత్వం.. కేటీఆర్ పంచ్‌లే పంచ్‌లు..
ఏడీ అంటే అటెన్షన్ డైవర్షన్ అని వివరణ ఇచ్చారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను పక్కదారి పట్టించేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్.
ఆమధ్య ఎన్డీఏని ఎన్పీఏ అంటూ విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని ఏడీ ప్రభుత్వం అంటూ సెటైర్లు పేల్చారు. ఏడీ అంటే అటెన్షన్ డైవర్షన్ అని వివరణ ఇచ్చారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను పక్కదారి పట్టించేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కేటీఆర్. దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర, మండిపోతున్న పెట్రో ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర, భారమవుతున్న నిత్యవసరాల ధరల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర ఇది.. అందుకే అది మోడీ ప్రభుత్వం కాదు, ఏడీ ప్రభుత్వం అని అన్నారు కేటీఆర్.
ఈ కుట్రలను కనిపెట్టాలి..
ఏడీ ప్రభుత్వం కుట్రల్ని కనిపెట్టలేకపోతే.. దేశానికే, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం అని అన్నారు కేటీఆర్. దేశం కోసం - ధర్మం కోసం.. అనేది బీజేపీ అందమైన నినాదం అని.. వాస్తవానికి విద్వేషం కోసం - అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానం అని దుయ్యబట్టారు.
హర్ ఘర్ జల్ కాదు, హర్ ఘర్ జహర్..
హర్ ఘర్ జల్ అని బీజేపీ నేతలంటున్నారు కానీ, వాస్తవానికి వారు హర్ ఘర్ జహర్ (విషం) నింపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. పచ్చగా ఉన్న తెలంగాణాలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నాలను ఏమనాలని ప్రశ్నించారు. విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా దేశంలో సోషల్ ఫ్యాబ్రిక్ (సామాజిక సామరస్యం)ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోంది అన్నారు.
ద్వేషం కాదు దేశం ముఖ్యం
ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం ముఖ్యం. మిత్రులారా ఈ విషయం గుర్తుంచుకోండి అని ట్వీట్ చేశారు కేటీఆర్.